ఆలయంలో హారతి మంటలు అంటుకుని అగ్ని ప్రమాదం(Fire Accident)సంభవించింది. ఈ ప్రమాదంలో 13మంది భక్తులకు గాయాలయ్యాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఉజ్జయినీ మహా కాలేశ్వర్ (Ujjaini Mahakaleshwar Temple) ఆలయంలో చోటు చేసుకుంది.
ఈ ఆలయం జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి. హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రధాన గోపురం కింద ఉన్న గర్భగుడిలో భస్మహారతి కార్యక్రమం నిర్వహిస్తుండగా మంటలు చెలరేగాయి. దీంతో ఆలయ ప్రధాన పూజారి సంజయ్ గౌర్, పూజారులు వికాస్, మనజ్, అన్ష్ పురోహిత్ మహేశ్ శర్మ, చింతామన్ గెహ్లాట్, పలువురు గాయాలపాలయ్యారు.
వారికి చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు కలెక్టర్ నీరజ్ కుమార్ సింగ్ తెలిపారు.గాయాలపాలైన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఇందౌర్ తీసుకెళ్లారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆలయంలో హోలీ వేడుకలు జరుగుతున్నాయి.
సీఎం మోహన్ యాదవ్ కుమారుడు, కుమార్తె తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. వారు ఘటనాస్థలానికి కొద్ది దూరంలోనే ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిపై ప్రత్యేక కమిటీ విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.