Maharaashtra : మహారాష్ట్ర థానే (Thane) జిల్లా లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆసుపత్రిలో కేవలం 12 గంటల్లో 17 మంది రోగులు మరణించారు. వీరిలో 12 మంది ఐసీయూలో, ఇద్దరు జనరల్ వార్డులో మరో ఇద్దరు క్యాజువాలిటీ వార్డులో మృతి చెందగా ఒకరు పీడియాట్రిక్ విభాగంలో ప్రాణాలు కోల్పోయారు. మూడు రోజుల క్రితమే ఒకే రోజున అయిదుగురు రోగులు మరణించారు. కల్వా ఆసుపత్రిగా కూడా వ్యవహరిస్తున్న ఈ హాస్పిటల్ రోగుల పాలిట యమకూపంలా మారిందన్న ఆరోపణలు వినవస్తున్నాయి.
డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇంతమంది రోగులు మృతి చెందుతున్నారని మృతుల బంధువులు అంటుండగా.. ఇది సరికాదని, వీరిలో పలువురు 80 ఏళ్ళు పైబడిన వృద్దులని, వృద్దాప్యంతోనే కన్ను మూశారని, కొందరు ఆరోగ్యం విషమించిన స్థితిలో అడ్మిట్ అయ్యారని డాక్టర్లు తెలిపారు. అయితే ప్రతి రోగి ఏ కారణం వల్ల మృతి చెందాడో తాము విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నామని ఆసుపత్రి డీన్ డా. రాకేష్ బారోట్ చెప్పారు.
ఒక్కసారిగా ఇంతమంది మృత్యుబాట పట్టారన్నషాకింగ్ సమాచారం తెలియగానే కల్వా-ముంబ్రా అసెంబ్లీ నియోజకవర్గం ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర ఆహద్ ఈ ఆసుపత్రికి వచ్చి వైద్య సిబ్బందిపై విరుచుకపడ్డారు. రోగుల ప్రాణాలంటే మీకు లెక్క లేదని మండిపడ్డారు. ఇక రోగుల మృతికి దారి తీసిన కారణాలపై రెండు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సావంత్ .. డీన్ డా. రాకేష్ ని ఆదేశించారు.
థానే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా ఈ వైనంపై స్పందిస్తూ. తామూ దీనికి కారణాలను తెలుసుకుంటున్నామని చెప్పారు. ఈ ఆసుపత్రి వ్యవహారం ఎంతవరకు వెళ్లిందంటే.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు తాము హాస్పిటల్ వద్ద హెచ్చు సంఖ్యలో పోలీసులను నియమించామని డీసీపీ గణేష్ గాడే తెలిపారు. మృతుల బంధువులు… డాక్టర్లు, వైద్య సిబ్బందిపై దాడి చేసే అవకాశాలున్న దృష్ట్యా ఈ చర్య తీసుకున్నామన్నారు.