నమ్మితిని శిద్దా అంటే నడి నెత్తిన చేయి పెట్టనా అన్నాడట వెనుకట.. ప్రస్తుతం రాష్ట్రంలో ఇలాంటి లీలలు ఎన్నో చూపించిన కేసీఆర్ సారు.. తెలంగాణ (Telangana)కు మనం తప్ప ఎవరు లేరనేలా ప్రవర్తించి నిండా ముంచారని జనం అనుకుంటున్నారు. చివరికి ఒక్క ఓటమితో.. కారు నిండా మునిగే సమయం ఆసన్నమైనా అవే పోకడలు.. అవే ప్రగల్భాలు మాట్లాడుతున్నారని అనుకొంటున్నారు..
అందుకే ప్రస్తుతం బీఆర్ఎస్ (BRS) నేతలు పార్టీకి రామ్ రామ్ అంటూ వెళ్లిపోతున్నా గులాబీ పెద్ద బాస్, చిన్న బాస్ పాత పాట ప్లే చేయడం వల్ల పార్టీకి పిసరంత లాభం లేదంటున్నారు.. మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లు ఇంతలో పార్లమెంట్ ఎన్నికలు రావడంతో అసలు పార్టీలో మిగిలే వారెందరు అనే అనుమానాలు మొదలైనట్లు తెలుస్తోంది. అందులో నేతల వలసలు టెన్షన్ పెట్టిస్తున్నాయి.
కొండ నాలుకకి మందు వేస్తే ఉన్న నాలుక ఉడినట్లు.. జాతీయ రాజకీయాల్లో కీ రోల్ పోషిస్తామని మహారాష్ట్రలో అడుగు పెట్టిన కేసీఆర్ కు అసలుకే ఎసరు వచ్చింది. మహారాష్ట్ర (Maharashtra) బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ మాణిక్ రావు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎన్సీపీ (NCP)లో చేరారు. ఆయనకు అజిత్ పవార్ కీలక పోస్ట్ ఇచ్చారు. ఎన్సీపీ కిసాన్ సెల్ అధ్యక్షుడిగా మాణిక్ రావును నియమించారు. కాగా ఈయనతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు సైతం ఎన్సీపీ గూటికి చేరారు.
మరోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం తర్వాత నెలల తరబడి అధినాయకత్వం సైలెంట్ గా ఉండటం, కేంద్ర నాయకత్వం నుంచి ఎలాంటి దిశానిర్దేశనం లేకపోవడంతో తమ రాజకీయ భవిష్యత్తు కోసం తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఏపీలో సైతం గులాబీ వాడిపోగా.. రాష్ట్రంలో పార్టీ కేడర్ అయోమయంగా మారింది. ఈ పరిస్థితుల్లో మహారాష్ట్రను పట్టించుకోవడం మానేసింది. దీంతో ఇక్కడి నేతలు బీఆర్ఎస్ కు హ్యాండ్ ఇవ్వక తప్పలేదని తెలుస్తోంది..