గన్నవరం నుంచి టీడీపీ(TDP) ఎమ్మెల్యే అభ్యర్థి మహాసేన రాజేష్ (Mahasena rajesh) పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తనపై అక్కసుతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌లను వైసీపీ నాయకులు తిట్టడం తనను బాధించిందన్నారు. ఈ పరిస్థితులు చూస్తుంటే తాను పోటీ చేయకపోవడమే మేలేమోనని అభిప్రాయ పడ్డారు. తన కోసం ఎవరినీ నిందించవద్దని ఈ మేరకు మహాసేన మీడియా ద్వారా రాజేష్ కోరారు.
అయితే, ఇటీవలే చంద్రబాబు-పవన్ కల్యాణ్ కలిసి టీడీపీ, జనసేన అభ్యర్థులను ప్రకటించారు. టీడీపీ నుంచి పి.గన్నవరం అభ్యర్థిగా మహాసేన రాజేష్‌కు అవకాశం కల్పించారు. అయితే, స్థానిక టీడీపీ, జనసేన నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అంతేకాకుండా పలు కుల సంఘాలు సైతం ఆయన అభ్యర్థిత్వాన్ని తప్పుపట్టాయి. ఈ నేపథ్యంలో ఆయన అసెంబ్లీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు.
మరోవైపు హిందువుల గురించి రాజేష్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారనీ.. అతడిని తప్పించాలని విశ్వహిందూ పరిషత్, రామసేన, బ్రాహ్మణ సంఘాలు ఆందోళన చేపట్టాయి. జగన్మాత పార్వతీ దేవిని కించపరుస్తూ సోషల్ మీడియా వేదికగా రాజేష్ ప్రచారం చేసినట్లు హిందూ సంఘాలు ఆరోపించాయి. సోషల్ మీడియా వేదికగా హిందూ సంఘాలు తప్పు పట్టడంతో.. వారి ఆందోళనలకు తలొగ్గి పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు రాజేష్ ప్రకటించారు.
అదేవిధంగా తనను హిందూ ద్వేషిగా చిత్రీకరిస్తున్నారనీ.. పార్టీకి చెడ్డపేరు రావొద్దనే పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు రాజేష్ తెలిపారు. అయితే, కనీసం పోటీ కూడా చేయనివ్వకుండా ఎంత సెంటిమెంట్ బ్లాక్ మెయిల్ పార్టీ మీదకి తీసుకోస్తున్నారని వైసీపీ పార్టీపై రాజేష్ ఫైర్ అయ్యారు. మా వర్గాలు ఎప్పుడు బాగుపడాలి.. ప్రశ్నించే వారు ఉండొద్దు.. అని వైసీపీపై విమర్శలు గుప్పించారు.
ఒక సామాన్యుడికి అవకాశం రాగానే వ్యవస్థ మొత్తం ఏకమైందన్నారు రాజేష్. కులరక్కసి చేతిలో బలైపోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన వల్ల పార్టీకి చెడ్డపేరు రావొద్దనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రశ్నించే వారికి చంద్రబాబు అసెంబ్లీ టికెట్ ఇస్తే.. పోటీ చేయకుండా వ్యవస్థతో అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.