అధికారంలో ఉన్న నేతలు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకోవడం కాస్త కష్టం అన్న విషయం తెలిసిందే. ఇక వారి దగ్గర పనిచేసే వారి పరిస్థితి చూస్తే ఒక్కోసారి జాలివేస్తుంది. అయినా ఉద్యోగం అన్నాక తిప్పలు, మంత్రులు అన్నాక కోపాలు ఉండకుండా ఉంటాయా..
ఇకపోతే ఎప్పుడు సౌమ్యంగా, శాంతంగా కనిపించే తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, తలసాని పుట్టినరోజు సందర్భంగా కాస్త అసహనాన్ని ప్రదర్శించారు. తన వ్యక్తిగత గన్‌మ్యాన్ చెంప చెళ్లుమనిపించాడు.
హైదరాబాద్ అమీర్‌పేట డివిజన్ డీకే రోడ్డులోని ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహార పథకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పథకం ప్రారంభోత్సవాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ రోజు మంత్రి తలసాని పుట్టిన రోజు కావడంతో మహమూద్ అలీ ఆయన్ని ఆలింగనం చేసుకొని పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
కాగా హోంమంత్రి, తలసానికి శుభాకాంక్షలు చెబుతున్న సమయంలో బోకే ఎక్కడ అంటూ పక్కనే ఉన్న తన సెక్యూరిటీ సిబ్బందిని అడిగారు. బోకే గురించి తెలియదని గన్ చెప్పడంతో సహనం కోల్పోయిన హోంమంత్రి కానిస్టేబుల్‌ను చెంప దెబ్బ కొట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.