మైనంపల్లి హన్మంతరావు (Mynamapali Hanmanth Rao )ను టీపీసీసీ కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి (Narsareddy Bupathi Reddy) ఈ రోజు కలిశారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని హన్మంతరావును ఆయన కోరారు. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ దూలపల్లిలోని హన్మంతరావు నివాసానికి భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు. దీంతో ఆయన నివాసంలో సందడి వాతావరణం నెలకొంది.
మీ సేవలకు కాంగ్రెస్ పార్టీకి కావాలని హన్మంతరావును కాంగ్రెస్ కార్యకర్తలు కోరారు. ఇటీవల బీఆర్ఎస్ కు హన్మంతరావు రాజీనామా చేశారు. త్వరలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు కాంగ్రెస కార్యకర్తలు అభినందనలు తెలిపారు. తాను కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి రెండు నియోజకవర్గాల నుంచి పోటీచేస్తానని కొంత మంది అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు.
తాను మల్కాజిగిరి నియోజక వర్గం నుంచి పోటీ చేస్తానని కుండబద్దలు కొట్టారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు నిన్న బీఆర్ఎస్ ను వీడారు. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు నిన్న ఓ వీడియో విడుదల చేశారు. తాజాగా ఆయన తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పంపారు. తాను బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు.
ఇటీవల తనకు ఖరారు చేసిన మల్కాజిగిరి టికెట్ ను తాను తిరస్కరిస్తున్నట్టు వెల్లడించారు. తన మద్దతుదారులు, అభిమానులతో సుదీర్ఘ చ్చల తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. బీఆర్ఎస్ కోసం, ప్రజా సంక్షేమం కోసం తాను చాలా కష్టపడ్డానన్నారు. గ్రేటర్ హైదరబాద్ అధ్యక్షునిగా తాను చేసిన కృషిని గుర్తించినందుకు కేసీఆర్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.