Telugu News » Mallanna Sagar : కేసీఆర్ జిల్లాలో రోడ్డెక్కిన నిర్వాసితులు.. ఇదేనా బంగారు తెలంగాణ?

Mallanna Sagar : కేసీఆర్ జిల్లాలో రోడ్డెక్కిన నిర్వాసితులు.. ఇదేనా బంగారు తెలంగాణ?

సీఎం సొంత జిల్లా సిద్దిపేటలో పరిహారం కోసం రోడ్డెక్కారు. రాజీవ్ రహదారిపై భైఠాయించారు.

by admin
mallanna-sagar-project-oustees-protest-on-hyderabad

వేల కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టింది తెలంగాణ ప్రభుత్వం. పైగా, అప్పులు తెచ్చి మరీ పనులు చేయించింది. కాళేశ్వరం (Kaleswaram) గుండెకాయలా చెప్పే మల్లన్న సాగర్ (Mallanna Sagar) ను కొన్ని నెలల క్రితమే సీఎం కేసీఆర్ (KCR) ఘనంగా ప్రారంభించారు. జాతికి అంకితం చేశారు. అయితే.. దీనికోసం భూములిచ్చిన నిర్వాసితులు మాత్రం ఇంకా పరిహారం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. రోడ్డెక్కి నిరసనలు కొనసాగిస్తున్నారు.

mallanna-sagar-project-oustees-protest-on-hyderabad 1

ఈ ప్రాజెక్టులో భాగంగా 8 గ్రామాలు, 14 శివారు గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురయ్యాయి. రిజర్వాయర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 50 టీఎంసీలు. చుట్టూ 22.60 కిలోమీటర్ల దూరం భారీ కట్టను నిర్మాణం చేశారు. భూ నిర్వాసితుల కోసం గజ్వేల్ లో కాలనీ నిర్మించి ఇచ్చింది ప్రభుత్వం. అయితే.. పరిహారం విషయంలో అన్యాయం చేసిందని ఇప్పటికీ కేసీఆర్ సర్కార్ పై మండిపడుతున్నారు నిర్వాసితులు. తాజాగా సీఎం సొంత జిల్లా సిద్దిపేట (Siddipet) లో పరిహారం కోసం రోడ్డెక్కారు. రాజీవ్ రహదారిపై భైఠాయించారు. గౌరారం, సింగరాయి పల్లి మధ్యలోని హైవేపై ధర్నా నిర్వహించారు. దీంతో ఆ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

మల్లన్న సాగర్ కోసం తొగుట, కొండపాక మండలాల్లో 9 గ్రామాల నుంచి దాదాపు 13 వేల పట్టా భూములను ప్రభుత్వం సేకరించింది. ఆయా గ్రామాల్లో ఎకరం రూ.20 లక్షలు పలుకుతోందని నిర్వాసితులు చెబుతున్నారు. కానీ, ప్రభుత్వం మాత్రం తమకు రూ.6 లక్షలకు మించి పరిహారం ఇవ్వలేదని.. వెయ్యి మంది వరకు కోర్టుల్లో పోరాడుతున్నారు. చాలా మందికి ఇప్పటికీ పరిహారం అందలేదని అంటున్నారు.

ప్రభుత్వ మాటలు నమ్మి తమ భూమిని ఇస్తే.. దిక్కులేని పక్షులమయ్యామని మల్లన్నసాగర్ నిర్వాసితులు వాపోతున్నారు. ఆ సదుపాయాలు కల్పిస్తాం.. ఇవి ఇస్తాం అంటూ ప్రభుత్వ పెద్దలు మాయమాటలు చెప్పి భూములు లాక్కున్నారని.. ఇప్పుడు కనీసం చట్టప్రకారం ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా తమకు న్యాయంగా రావాల్సిన పరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

మల్లన్నసాగర్ సామర్థ్యం 50 టీఎంసీలు. సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ నుంచి సొరంగం ద్వారా తుక్కాపూర్ పంప్ హౌస్ కు చేరిన గోదావరి జలాలను ఇందులోకి ఎత్తిపోస్తారు. ఈ రిజర్వాయర్ తో మొత్తంగా ఉమ్మడి మెదక్ తో పాటు ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లోని దాదాపు 11.29 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ రిజర్వాయర్ కు 5 తూములు ఉన్నాయి. వీటి ద్వారా కొండపోచమ్మ, గంధమల్ల రిజర్వాయర్ కు, సింగూర్ ప్రాజెక్టుకు, తపాస్ పల్లి రిజర్వాయర్ కు, మిషన్ భగీరథకు నీటిని తరలిస్తారు. అంతేగాకుండా హైదరాబాద్ తాగునీటి కోసం 20 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాల కోసం 16 టీఎంసీలు వాడతారని అంటున్నాయి.

You may also like

Leave a Comment