కాంగ్రెస్ ఎన్నికల కమిటీ (CEC) కీలక సమావేశాన్ని మధ్య ప్రదేశ్ రాజధాని భోపాల్ (Bopal) లో నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక గురించి ఈ సమావేశంలో కీలకంగా చర్చించినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఈ సమావేశానికి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ముఖ్య నేతలు అధిర్ రంజన్ చౌదరి, అంబికా సోనీ, మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్ కమల్ నాథ్, ఇతర నేతలు పాల్గొన్నారు. పితృ పక్షాల తర్వాత పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని పార్టీ ఇప్పటికే స్పష్టం చేసింది. సీఈసీలో ఫైనల్ చేసిన అభ్యర్థుల జాబితాను త్వరలోనే ప్రకటిస్తామని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
మధ్యప్రదేశ్ తో పాటు చత్తీస్ గఢ్, తెలంగాణ అభ్యర్థుల జాబితాపై కూడా చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. వచ్చే నెల 17న మధ్య ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ను నిర్వహించనున్నారు. మొత్తం 230 స్థానాలకు పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్-3 ఫలితాలను విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ఎన్నికల సంఘం వెల్లడించింది.
ఇక చత్తీస్ గఢ్‌లో రెండు విడతల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు. రాష్ట్రంలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు వున్నాయి. వచ్చే నెల 7న తొలి విడత ఎన్నికలను, 17న రెండో విడత ఎన్నికలను నిర్వహించనున్నారు. ఇక తెలంగాణలో వచ్చే నెల 30న ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 3 ఫలితాలను ప్రకటిస్తారు.