రాబోయే లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని కాంగ్రెస్ (Congress) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 400 సీట్ల ప్రణాళిక కార్య రూపం దాల్చదని వెల్లడించారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 100 సీట్లు కూడా గెలవదని అని తెలిపారు. ఈ సారి బీజేపీ అధికారానికి దూరమవుతుందని చెప్పారు.
యూపీ అమేథిలో జరిగిన బహిరంగ సభలో మల్లికార్జున ఖర్గే పాల్గొని మాట్లాడుతూ… అమేథీ, రాయ్ బరేలీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్నోసార్లు విజయం సాధించిందని పేర్కొన్నారు. ప్రజల్లో శత్రుత్వం పెంచేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని వివరించారు. కాంగ్రెస్ హయాంలో అమేథీలో కోట్లాది ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని తెలిపారు.
కానీ వాటిలో చాలా వరకు పెండింగ్‌లోనే ఉండిపోయాయని వెల్లడించారు. ప్రాజెక్టులు ఇంకా ఎందుకు అసంపూర్తిగా ఉన్నాయని బీజేపీని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. అమేథీ, రాయ్‌బరేలీలో అభివృద్ధి పనులు చేసేందుకు బీజేపీ ఇష్టపడదని వెల్లడించారు. తాను పార్లమెంట్లో ఎప్పుడు మాట్లాడినా తన మైక్రోఫోన్‌ను స్విచాఫ్ చేస్తూ తన ప్రసంగానికి అధికార పార్టీ సభ్యులు అడ్డుతగులుతున్నారని ఆరోపణలు గుప్పించారు.
ప్రధాని మోడీ నియంతలాగా మారారని అన్నారు. ఆయన మరోసారి విజయం సాధిస్తే దేశంలో ప్రజాస్వామ్యం ఉండదని వివరించారు. రాబోయే రోజుల్లో రాజ్యాంగం ఉనికే కనుమరుగవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు, కార్మికులు, దళితులు, బీసీలు, గిరిజనులకు మోడీ ఎలాంటి గ్యారంటీ ఇవ్వరని దేశంలోని ఇద్దరు ముగ్గురు సంపన్న పారిశ్రామికవేత్తలకే మోడీ గ్యారంటీ లభిస్తుందని ఎద్దేవా చేశారు.