కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(cwc)సమావేశాలు హైదరాబాద్ లో ఈ రోజు ప్రారంభం అయ్యాయి. హోటల్ తాజ్ కృష్ణ(Taj krishna)లో ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు. సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే(mallikarjuna kharge) ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
కేంద్రంలో గత తొమ్మిదిన్నరేండ్లుగా ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిందన్నారు. సామాన్యుల సమస్యల పరిష్కారానికి కమిట్ మెంట్ తో తమ పార్టీ పని చేసిందన్నారు. దేశం ప్రస్తుతం పలు అంతర్గత సవాళ్లను ఎదుర్కొటోందన్నారు. ద్రవ్యోల్బణాన్ని అరికట్టడం, నిరుద్యోగం, మణిపూర్ హింసను అదుపు చేయలేకపోవడం.. ఇలా అన్ని రంగాల్లోనూ మోడీ సర్కార్ ఘోరంగా విఫలం అయిందన్నారు.
అన్ని రంగాల్లో మోడీ సర్కార్ విఫలం అయిందని పేర్కొన్నారు. మణిపూర్ హింస హర్యానాలోని నుహ్ వరకు అంటుకునే వరకు మోడీ సర్కార్ చూస్తు కూర్చుందన్నారు. మన ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం చాలా ప్రమాదంలో ఉందన్నారు. పెరిగిన ద్రవ్యోల్బణం, ఆకాశాన్నంటున్న ధరలు పేదల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయన్నారు.
దేశంలో నిరుద్యోగం రికార్డు స్థాయిలో ఉందని ఫైర్ అయ్యారు. దేశంలో అసమానతలు పెరిగిపోతున్నాయన్నారు. ఆత్మనిర్భర్ భారత్, 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ, 3వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ వంటి నినాదాలన్నీ బూటకమన్నారు. కేవలం ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకుని ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈ నినాదాలు ఇస్తున్నారన్నారు.
ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, సోనియాగాంధీతో పాటు ఇతర ప్రముఖ నేతలు హాజరయ్యారు. రెండు రోజుల పాటు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. ఇది ఇలా వుంటే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో మాజీ మంత్రి, సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు.