బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ ఇటీవల ఎమ్మెల్యే కడియం శ్రీహరి(MLA Kadiyam Srihari) ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల మీడియాతో ఆయన మాట్లాడుతూ వరంగల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఆరూర్ రమేశ్(Aruri Ramesh)తో పాటు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగపై సంచలన ఆరోపణలు చేశారు. అయితే, తాజాగా ఆయన వ్యాఖ్యలపై మందకృష్ణ మాదిగ స్పందించారు.
శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. కడియం శ్రీహరి 40ఏళ్లుగా విలువలు లేని స్వార్థ రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి విలువల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. దమ్మూ, ధైర్యం ఉంటే రాజగోపాల్ రెడ్డి, ఈటలను ఆదర్శంగా తీసుకొని కడియం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
పిచ్చికుక్క కంటే కడియం హీనమైన వ్యక్తి అంటూ మందకృష్ణ మాదిగ విరుచుకుపడ్డారు. కడియం నీతిమంతుడిలా ఫోజులు కొట్టడం మానుకోవాలని హితవు పలికారు. తనకు గతంలో ఎంపీ సీటు ఇస్తానన్నా నిరాకరించానని తెలిపారు. 2007లో వైఎస్ఆర్ ఎమ్మెల్సీ ఇస్తానన్నా, 2009లో వైఎస్ఆర్ వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తానన్నా వద్దని చెప్పానని గుర్తు చేశారు. రెండు పార్టీలనుండి టికెట్ తెచ్చుకున్న నీచ చరిత్ర నీది అంటూ మందకృష్ణ కడియంపై మండిపడ్డారు.
మాదిగల టికెట్లను లాక్కుని అన్యాయం చేసిన కుట్రదారుడు కడియం అని ఆరోపించారు. కాంగ్రెస్, కడియం ఇద్దరూ మాదిగలకు ద్రోహం చేశారని అన్నారు. రాజ్యాంగాన్ని మరుస్తారని, రిజర్వేషన్లు ఎత్తేస్తారని బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారని మందకృష్ణ మాదిగ తెలిపారు. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ప్రమాదం వచ్చింది ఇందిరాగాంధీ కాలంలోనే వచ్చిందని, రాజకీయ జీవితం మొత్తం కాంగ్రెస్‌ను విమర్శించి ఇప్పుడెలా ఆ పార్టీలో చేరావంటూ ప్రశ్నించారు.
మోడీ ప్రధాని అయ్యాక ఉగ్రవాదులకు, వాళ్ళను పంపుతున్న పాకిస్తాన్‌కు నిద్ర పట్టడంలేదన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో నిత్యం స్కాములే, అవినీతికి పాల్పడ్డ నాయకులకు నిద్ర లేదని తెలిపారు. 28 కుట్రపూరిత పార్టీల కన్నా మోడీ ఒక్కడు చాలంటూ అభివర్ణించారు. రాజ్యాంగమే తమ ప్రామాణికమని మోడీ అన్నారని గుర్తుచేశారు. భగవద్గీత, ఖురాన్, బైబిల్ రాజ్యాంగమేనని వ్యాఖ్యానించారు. మళ్ళీ అంబేద్కర్ పుట్టినా రాజ్యాంగాన్ని మార్చలేరని కాశ్మీర్లో మోడీ ప్రకటించారని వెల్లడించారు.
మోడీ పదేళ్ల పాలనలో రిజర్వేషన్లు ఎత్తేయలేదని, అగ్రకులాల పేదలకు రిజర్వేషన్లు ఇచ్చారని గుర్తుచేశారు. ఎమర్జెన్సీ పెట్టడానికి భయపడని ఇందిరాగాంధీ, మహిళా బిల్లు పెట్టలేదని, 10 ఏళ్లు యూపీఏ చైర్‌పర్సన్‌గా ఉన్న సోనియా హయాంలోనూ మహిళా బిల్లు రాలేదన్నారు. మోడీ వస్తే రిజర్వేషన్లు, మహిళా బిల్లు వస్తుందని మందకృష్ణ మాదిగ ధీమా వ్యక్తం చేశారు.