మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(MRPS) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(Mandakrishna Madiga) సీఎం రేవంత్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా హనుమకొండలోని హరిత హోటల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఓ బ్రోకర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ఉద్యమం చేసి సీఎం కాలేదని, బ్రోకరిజం చేస్తూ సీఎం అయ్యాడని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి అనే బ్రోకర్ వల్ల మాదిగలు, మాలలు మోసపోయారని ఆరోపించారు. సీఎం పదవిలో ఉండే నైతిక విలువలు రేవంత్ రెడ్డికి లేవని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాభిమానం ఉంటే రేవంత్ రెడ్డి కామారెడ్డిలో ఎందుకు ఓడిపోయాడని ప్రశ్నించారు. కడియం శ్రీహరినిని తానే పిలిచానని చెప్తున్న సీఎం.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఎందుకు అడగలేదని నిలదీశారు. ఒక పార్టీలో గెలిచి ఇతర పార్టీలో చేరితే పిచ్చి కుక్కల్లా రాళ్లతో కొట్టమని రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు.
కడియం శ్రీహరిని రాజీనామా చేయనీయకుంటే రాళ్లతో కొట్టాల్సి వస్తుందన్నారు. కడియం శ్రీహరి కులం ఎస్సీ కాదని చెప్పిందే రేవంత్ రెడ్డి అని, శాసనసభ కమిటీ ముందు కులాన్ని నిరూపించుకోవాలని టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ విమర్శలు చేశారని దుయ్యబట్టారు. ఎస్సీ కాకుండానే ఎస్సీ సర్టిఫికెట్ తీసుకున్నాడని మోత్కుపల్లి నర్సింహులు చెప్పాడని, కడియం శ్రీహరి ఎస్సీ కానప్పుడు కడియం కావ్య ఎలా ఎస్సీ అవుతుందన్నారు. ఎస్సీ కాని కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు.
ఓరుగల్లు ఉద్యమంలో రగిలిపోతుంటే చంద్రబాబుకు వత్తాసు పలికిన వ్యక్తి కడియం శ్రీహరి అని విమర్శించారు. కొడంగల్‌కు, వరంగల్‌కు నాలుగు నెలల్లో ఎంత ఖర్చు చేశారో రేవంత్‌రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ ఎక్కడికెళ్లినా దేవుళ్ళ పేర్ల మీద ఒట్టు వేస్తున్నాడని, దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తోంది బీజేపీ కాదు.. రేవంత్ రెడ్డి అని అన్నారు. మోడీ వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని రేవంత్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు.
కోడ్ ముగియగానే రుణమాఫీ చేసే అవకాశమున్నా ఆగస్టు వరకు ఎందుకన్నారు. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లకు బీజేపీ ప్రభుత్వంలో డోఖా ఉండదని మంద కృష్ణ మాదిగ చెప్పుకొచ్చారు. అణగారిన వర్గాల రిజర్వేషన్లు బీజేపీ ప్రభుత్వంలో పెరుగుతాయన్నారు. మతపరమైన రిజర్వేషన్లకు మాత్రమే బీజేపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. రాజ్యాంగానికి ప్రమాదం వచ్చిందే ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అని, రేవంత్ రెడ్డి దుష్ప్రచారాలు మానకుంటే రాళ్ల వర్షం కురుస్తుందని హెచ్చరించారు.