Manipur : అసలే కొన్ని నెలల పాటు హింసతో అట్టుడికిన మణిపూర్ లో అల్లర్లను రెచ్చగొట్టేలా, హిందువులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న విదేశీయుడి నిర్వాకం వెలుగులోకి వచ్చింది. అమెరికా నుంచి టూరిస్టు వీసాపై ఇండియాకు వచ్చి మత సంబంధ కార్యకలాపాలలో పాల్గొంటూ చడీ చప్పుడు లేకుండా హిందూ మత వ్యతిరేక ప్రచారం చేస్తున్న డేనియల్ కర్నీ అనే ఇతని చరిత్ర కూడా తక్కువైనదేమీ కాదు. ఇతడ్ని లోగడ ఇండియా నుంచి బ్లాక్ లిస్టులో పెట్టారు. అమెరికన్ ఇవాంజెలిస్ట్ అయిన ఈయన మణిపూర్ లో హిందువుల పట్ల ద్వేషం కలిగేలా ప్రచారం చేస్తున్నాడని బీజేపీ ఆరోపిస్తోంది. సామాజిక సేవ చేస్తున్నాననే నెపంపై .. ప్రజలకు దుప్పట్లు వగైరా పంపిణి చేస్తూ క్రిస్టియానిటీని ప్రోత్సహిస్తున్న వైనం బయట పడింది.
2017 లో టూరిస్టు వీసాపై ఇండియాకు వచ్చిన డేనియల్.. మణిపూర్ లో ప్రజలకు బైబిల్ పపుస్తకాలు ఇస్తున్నాడని, కరపత్రాలు పంచుతున్నాడని తెలిసింది. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉపన్యాసాలు ఇస్తున్నట్టు కూడా వెల్లడైంది. ఆగస్టు 5 న ఇతగాడు మణిపూర్ నుంచి ఓ లైవ్ వీడియోను పోస్ట్ చేస్తూ.. ఈ రాష్ట్రంలో క్రైస్తవులను వేధిస్తున్నారని, కావాలనే వారిని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించాడు. ఇక్కడ మెయితీలు, కుకీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందని, కుకీలు గిరిజన క్రైస్తవులని, వారిపైనే పథకం ప్రకారం దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నాడు. వారు భయంతో ఇళ్ళ నుంచి పారిపోతున్నారు.. వారుంటున్న గ్రామాలను తగులబెడుతున్నారు. ఇదంతా వారు క్రైస్తవులనే జరుగుతోంది. ఇంత జరుగుతున్నా బీజేపీ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది అంటూ తన ప్రసంగంలో హిందూ వ్యతిరేక ప్రచారం చేశాడు.
ప్రభుత్వాన్ని ‘ర్యాడికల్ హిందూ ప్రభుత్వం’ గా ఆరోపించాడు. ఈశాన్య రాష్ట్రంలో ఎన్నో చర్చిలు ఉన్నాయని, ఇన్నింటిని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని, కానీ వాటిపై దాడులు జరుగుతున్నాయన్నాడు. క్రిస్టియానిటీ పెరుగుదలకు అడ్డుకట్ట వేయడానికి పథకం ప్రకారం యత్నాలు జరుగుతున్నాయని డేనియల్ పేర్కొన్నాడు. కుకీ గిరిజనులను ప్రశంసిస్తూ మెయితీలను దుయ్యబట్టే రీతిలో మాట్లాడాడు. కుకీలను చూసి మెయితీల్లో అసూయ పెరుగుతోందని అన్నాడు.
భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించేందుకు బీజేపీ ప్రభుత్వం యత్నిస్తోందని పేర్కొన్న ఆయన.. బాబా సాహెబ్ అంబేద్కర్ బుద్ధిజం బదులు క్రైస్తవ మతంలోకి మారి ఉంటే బాగుండేదని అన్నాడు. జీసస్ గురించి బోధనలు చేస్తున్నందుకు తనను చంపాలని హిందువులు ఎన్నో ప్రయత్నాలు చేశారని ఆరోపించాడు. జై శ్రీరామ్ అనాలని తనపై ఒత్తిడి తెచ్చారని, కర్రలు, రాడ్లతో తనను కొట్టారని అన్నాడు. తెలంగాణ లోని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఇతనిపై హోమ్ మంత్రిత్వ శాఖకు లేఖ రాస్తూ ఇతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. డేనియల్ నేపాల్ నుంచి ఇండియాకు చేరుకొని హిందూ మత వ్యతిరేక ప్రచారం చేస్తున్నాడని తన లేఖలో పేర్కొంది.