తుక్కుగూడలో రూ. 100 కోట్లతో నిర్వహించిన కాంగ్రెస్ (Congress) సభపై బీఆర్ఎస్ (BRS) పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ (Manne Krishank).. సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ (KCR)ను తిట్టేందుకు పార్టీ రూ. 100 కోట్లు ఖర్చు పెట్టిందని ఆరోపించారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఓట్ల కోసం ప్రస్తుతం ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌ను వెబ్‌సిరీస్‌గా నడిపిస్తోందని మండిపడ్డారు..
కేసీఆర్ అంటే రాహుల్, రేవంత్ భయపడుతున్నారని తెలిపిన క్రిశాంక్.. వరంగల్ డిక్లరేషన్‌లో ప్రకటించిన రూ. 500 బోనస్, రైతుకు రూ. 15 వేల ఆర్థికసాయం వంటి హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ తో కాంగ్రెస్.. ఈడీ పేరుతో మోడీ.. హింసిస్తున్నారని ఆరోపణలు చేశారు.. అదేవిధంగా 10 లక్షల కన్వర్జేషన్స్ ట్యాపింగ్ చేశారని, దీని కోసం వార్ రూమ్స్ ఏర్పాటు చేసినట్లు ప్రచారం చేసుకొంటున్నారన్నారు.
ఒకవేళ వారు చెప్పేది నిజమైతే నిస్పక్షపాతంగా ఈ అంశంపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు యూపీఏ చైర్‌పర్సన్‌గా సోనియా.. ఎంపీగా రాహుల్ ఉన్నప్పుడు, నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఫోన్ ట్యాపింగ్‌పై ఒక స్టేట్మెంట్ విడుదల చేసినట్లు గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ అవసరమని మన్మోహన్ పేర్కొన్నట్లు ఆరోపించారు. అప్పుడు ఆయనను ఇలాగే బద్నాం చేశారా..? అని ప్రశ్నించారు.
ఇదే విషయంలో మరి మాట్లాడితే రేవంత్ రెడ్డి తమపై కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు.. అప్పుడు ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీకి సోయి లేదా..? అన్నారు.. అదీగాక ఫోన్ ట్యాపింగ్ విషయాలను బయటపెట్టలేమని ఢిల్లీ (Delhi) హైకోర్టుకు టెలింకాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపినట్లు వెల్లడించారు. ఇదంతా ప్లాన్ ప్రకారం కొందర్ని కాపాడటానికి జరుగుతున్న ప్రయత్నంగా క్రిశాంక్ అనుమానం వ్యక్తం చేశారు..