తెలంగాణ (Telangana)లో మరోసారి మావోయిస్టులు (Maoists) రెచ్చిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లాకు చెందిన 25మంది వ్యాపారులను కిడ్నాప్ చేశారు. పోలీసులకు సహకరిస్తే హతమారుస్తామని వ్యాపారులను, మావోయిస్టులు హెచ్చరించి వదలిపెట్టినట్టు సమాచారం.. వీరిలో కొందరు చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా గొల్లపల్లికి చెందిన వారీగా.. మరికొందరు కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలానికి చెందిన వ్యాపారులుగా గుర్తించారు.
మరోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో మావోయిస్టులు వ్యాపారస్తులను కిడ్నాప్ చేయడం కలకలం రేపుతోంది. ఇదిలా ఉండగా చర్ల మండలం, బెస్త కొత్తూరు, అంజినాపురం గ్రామాల మధ్య మావోయిస్టులు అమర్చిన మందు పాతరను పోలీసులు వెలికి తీశారు. అదీగాక ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లో మావోయిస్టులు ఓ టవర్ జనరేటర్‌ను తగలబెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది.
ఛత్తీస్‌గఢ్- దంతెవాడ నారాయణపూర్ జిల్లాల మార్గ మధ్యలోని హర్రా కొడేర్ గ్రామంలో జియో టవర్ జనరేటర్‌ను మావోయిస్టులు తగలబెట్టారు. అనంతరం ఘటనా స్థలంలో బ్యానర్లు, కరపత్రాలను వదలి వెళ్లారు. మరోవైపు మావోయిస్టులు డిసెంబర్ 2 నుండి 8 వరకు పి.ఎల్.జి.ఏ. వారోత్సవాలను గ్రామగ్రామాన నిర్వహించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. పోలీసుల నిఘా నీడల మధ్య కొనసాగుతోంది. ఎన్నికల నేపథ్యంలో అధికారులు భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. లక్షమంది పోలీస్ సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారు.. అయినా అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి.