సంతోష్ నగర్ సీఐ (Santhosh Nagar CI)తో ఏఐఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ (Akbaruddin Owaisi) చేసిన వ్యాఖ్యలపై అసోం సీఎం హిమంత బిస్వ శర్మ (Himantha Biswa Sharma) స్పందించారు. ఇదే ఘటన అసోంలో జరిగి వుంటే ఆ విషయాన్ని ఐదు నిమిషాల్లో సెటిల్ చేసి వుండేవాడినన్నారు. తెలంగాణలో బుజ్జగింపు రాజకీయాల వల్ల ఈ ఘటనపై అటు బీఆర్ఎస్ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు.
ఈ ఘటనపై ఎన్నికల సంఘం విచారణ జరపాలని కోరారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ గత రాత్రి చాంద్రాయణ గుట్టలో ఎన్నికల ప్రచారం చేశారు. ప్రచార అనుమతి సమయం మించి పోతుండటంతో ఆ విషయాన్ని అక్కడే ఉన్న సీఐ శివ చంద్ర అక్బరుద్దీన్ కు గుర్తు చేశారు.
సీఐ మాటలు విన్న ఓవైసీ ఆగ్రహంతో ఊగిపోయారు. తన వద్ద కూడా వాచ్ ఉందన్నారు. మరో ఐదు నిమిషాల సమయం మిగిలి వుందన్నారు. అవసరమైతే తాను మరింత సమయం కూడా మాట్లాడుతానన్నారు. తనను అడ్డుకునే వ్యక్తి ఇంకా పుట్టలేదని చెప్పారు. తనను ఎలా అడ్డుకుంటారో చూస్తానని సవాల్ చేశారు. కత్తిపోట్లు, బుల్లెట్ గాయాలు అయినంత మాత్రాన తన పని అయిపోలేదని, ఇప్పటికీ తనలో ఆ దమ్ము ఉందన్నారు.
ఈ వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు అడ్డుకున్నందుకు సెక్షన్ 353 కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. సమావేశంలో అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై దర్యాప్తు జరుపుతున్నామని సీపీ సందీప్ శాండిల్య వెల్లడించారు. అక్బరుద్దీన్ విజ్ఞత లేకుండా మాట్లాడారని సీపీ అన్నారు. మరోవైపు ఈ ఘటనపై ఎన్నికల సంఘానికి ఎంఐఎం నేతలు ఫిర్యాదు చేశారు.