రాబోయే సార్వత్రిక లోక్ సభ ఎన్నికల్లో బహుజన సమాజ్ వాది పార్టీ ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోబోతందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై బీఎస్పీ అధినేత్రి (BSP Chief) మాయావతి (Mayawati) స్పందించారు. తాము ఎవరితోనూ పొత్తులు పెట్టుకోబోవడం లేదని స్పష్టం చేశారు.
ఈ ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుందని వెల్లడించారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ తాము పొత్తులు పెట్టుకోబోమని బీఎస్పీ పదే పదే స్పష్టంగా చెబుతోందని తెలిపారు. అయినప్పటికీ పొత్తుల గురించి ప్రతిరోజూ పుకార్లు వ్యాప్తి చెందుతూనే ఉన్నాయని అన్నారు. దీన్నిబట్టి బీఎస్పీ లేకుండా కొన్ని పార్టీలు ఎన్నికల్లో రాణించలేవని రుజువు అవుతోందని ఎద్దేవా చేశారు.
రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలనేది తమ పార్టీ నిర్ణయమని ఆమె చెప్పారు. మొత్తం సమాజం ప్రయోజనాలను, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, ముఖ్యంగా పేదలు, దోపిడీకి గురవుతున్న అణగారిన వర్గాల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని, దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల కోసం తన సొంతబలంతో పోటీ చేసేందుకు బీఎస్పీ నిర్ణయించిందన్నారు.
పొత్తుల విషయంలో గత నెలలో బీఎస్పీ అధినేత్రి మాయావతి కీలక వ్యాఖ్యలు చేశారు. తమతో పొత్తుల వల్ల మిత్ర పక్షాలకే లాభం చేకూరుతోందని, తమ పార్టీకి పెద్దగా ప్రయోజనాలు రావడం లేదన్నారు. ఈ సార్వత్రిక లోక్ సభ ఎన్నికల్లో తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోవడం లేదని తెలిపారు. కానీ ఎన్నికల అనంతరం పొత్తులపై ఫలితాల అనంతరం ఆలోచిస్తామని వెల్లడించారు.