మేడారం జాతర(Medaaram Jathara)కు భక్తులు పెద్దసంఖ్యలో తరలివెళ్తుంటారు. అటవీ ప్రాంతంలో జరిగే ఈ జాతరను చూసేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) సిద్ధమైంది.
ఉచిత వైఫై సేవలు అందించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. భక్తులు అధికంగా ఉండే 16 ప్రధాన ప్రాంతాల్లో ప్రజలందరూ ఉచితంగా వైఫై సేవలను అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు మేడారం మహాజాతరలో ఇప్పటికే చర్యలు ప్రారంభించారు. ఇంటర్నెట్ సేవలను భక్తుల చేతికి అందించేందుకు బీఎస్ఎన్ఎల్ మేడారం మహాజాతరలో 16 చోట్ల హాట్ స్పాట్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది.
ఏ నెట్వర్క్ యూజర్ అయినా సులభంగా లాగిన్ అయి వైఫై సేవలను ఉపయోగించుకోవచ్చు. 10 నుంచి 20 Mbps వేగంతో 1 GB వరకు డేటాను ఉపయోగించవచ్చు. ప్రభుత్వం ఈ ఉచిత వైఫై సేవల కోసం సుమారు రూ.20లక్షలు కేటాయించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నెల 15 నుంచి బీఎస్ఎన్ఎల్ వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జాతర జరగనుండగా, 25వ తేదీ వరకు అంటే.. జాతర ముగిసే దాకా వైఫై సేవలు అందుబాటులో ఉంటాయి. మేడారం జాతరలో బీఎస్ఎన్ఎల్ సిమ్‌లు కూడా ఉచితంగా ఇవ్వనున్నారు. రూ.249 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 45 రోజుల పాటు ప్రతిరోజూ 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు, అపరిమిత అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ కాల్స్ పొందవచ్చని అధికారులు తెలిపారు.