తెలంగాణ (Telangana) కుంభమేళాగా ప్రసిద్ధి గాంచిన మేడారం (Medaram) సమ్మక్క, సారలమ్మ జాతర (Sammakka Sarakka Jatara)కు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే భక్తులు తమ మొక్కులు చెల్లించుకోవడానికి తరలి వెల్లుతున్నారు. ఇందుకోసం ఆర్టీసీ ఇప్పటికే చర్యలు చేపట్టింది. జాతరకు పెద్ద మొత్తంలో బస్సులను నడపడానికి ముందుకు వచ్చింది. ఇక రోడ్డు మార్గంలోనే కాకుండా ఆకాశ మార్గంలో కూడా జాతరకు వెళ్ళేలా సేవలు అందుబాటులోకి వస్తున్నాయి.
రోడ్డు మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందిగా అనుకొంటున్నవారి కోసం.. వనదేవతల దర్శనం మరింత సులభతరంగా చేసుకొనేలా మేడారం జాతర సుందర దృశ్యాల విహంగ వీక్షణానికి హెలికాఫ్టర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 21 నుంచి 24 వరకు జాతర జరగనున్న నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. అదీగాక హైదరాబాద్, హనుమకొండ పర్యాటక శాఖల ఆధ్వర్యంలో మేడారం వరకు హెలికాఫ్టర్ (Helicopter) సర్వీసులను నడుపనున్నారు.
ఇందులో ప్రయాణించే వారికి ప్రత్యేక దర్శనం కల్పిస్తున్నారు. మేడారం పరిసరాల అందాలను వీక్షించేందుకు భక్తుల కోసం ప్రత్యేకంగా మేడారంలో హెలికాఫ్టర్ జాయ్ రైడ్‌ను సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం చార్జీలను సైతం ప్రకటించారు. వరంగల్ నుంచి మేడారానికి వెళ్లి తిరుగు ప్రయాణానికి రూ.28 వేల 999 రూపాయలు, మేడారంలో జాయ్ రైడ్ కోసం రూ.4,800 రూపాయలుగా టికెట్ ధర నిర్ణయించారు.
ఈ ప్రయాణంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకొన్నామని అధికారులు తెలిపారు. భక్తులు హెలికాఫ్టర్ సేవలను కూడా వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. ఇకపోతే గతంలో సేవలందించిన ప్రైవేటు సంస్థతోనే ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొని ఈ సేవలను అందుబాటులోకి తెస్తుంది. మరోవైపు ములుగు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. గత ఐదు సంవత్సరాలుగా మేడారంలో హెలికాప్టర్ సేవలు అందిస్తున్నాం. ఈ ప్రయాణంలో ఎలాంటి ప్రమాదం కాకుండా ట్రయల్ రన్ కూడా చేస్తున్నామని తెలిపారు..