తెలంగాణ కుంభమేళా(Telangana Kumbh Mela)గా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర(Medaram Sammakka-Saralamma fair) ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ జాతర ప్రత్యేకతపై మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కారులో ప్రయాణిస్తూనే మంత్రులు జాతరకు సంబంధించిన ప్రత్యేకతలు, జాతరతో ముడిపడిన పలు అంశాలపై మాట్లాడుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మేడారం జాతర సమయంలోనే తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన విషయాన్ని మంత్రి పొన్నం గుర్తు చేశారు.
‘ఎప్పుడైనా మేడారం జాతరకు వచ్చారా? అన్న..’ అని సీతక్క అడిగారు. అందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ బదులిస్తూ చిన్నప్పటి నుంచి అనేక సార్లు జాతరకు వచ్చానని, ఎంపీగా ఉన్న సమయంలో తెలంగాణ ఏర్పాటు కావాలని మొక్కుకున్నానని గుర్తుచేశారు. అదేవిధంగా 2014లో ఫిబ్రవరి 13న తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రోజే దేవతలు వనం నుంచి గద్దెపైకి వచ్చాని పొన్నం గుర్తు చేశారు.
గతంలో ఎవరు జాతరకు వచ్చినా జై సమ్మక్క, జై సారలమ్మతో పాటు జై తెలంగాణ నినాదాలు చేసేవారని సీతక్క తెలిపారు. 60 ఏళ్ల ప్రజల ఆకాంక్షకు సంబంధించిన బిల్లును తాను ఆ జాతరలో ఉండగానే ప్రవేశపెట్టారని మంత్రి సీతక్క చెప్పారు. ఈ జాతరలో విధులు నిర్వహించే అధికారులకు అంతా మంచే జరుగుతున్నదని అందరికి ప్రమోషన్లు లభించే ఆనవాయితీ ఉందని సీతక్క చెప్పారు.
ఇక సమ్మక్క సారలమ్మ అక్కాచెల్లెళ్లు అని సినిమాల్లో చూపించారని నిజానికి వీరిద్దరూ తల్లీకూతురు అని సీతక్క చెప్పారు. అదేవిధంగా పొన్నం సమ్మక్క జాతరకు రవాణా ఏర్పాట్లపై స్పందిస్తూ ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం ఎలా? అని తాను భయపడ్డానని పొన్నం చెప్పగా ‘జాతరకు ఫ్రీ జర్నీ ఇస్తారా లేదా అనేది నాకూ డౌట్ ఉండే..’ అని సీతక్క చెప్పుకొచ్చారు. ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు మేలు జరిగిందని మంత్రులు చెప్పుకొచ్చారు.
మేడారం జాతర ప్రత్యేకత పై సహచర మంత్రి సోదరి సీతక్క గారితో చిట్ చాట్@seethakkaMLA#medaramjathara pic.twitter.com/foW4TF3ZTC
— Ponnam Prabhakar (@PonnamLoksabha) February 5, 2024