ములుగు జిల్లా(Mulugu District)లో మావోయిస్టుల పేరుతో ఓ లేఖ కలకలం రేపుతోంది. మేడారం జాతరలో భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యమైందని మావోయిస్టు పార్టీ(Maoist Party) ఆరోపించింది. భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు జయశంకర్-మహబూబాబాద్- వరంగల్ (2)-పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి వెంకట్ పేరుతో ఓ లేఖ విడుదలైంది.
లేఖలో ముందుగా సమ్మక్క సారక్క జాతర ప్రాముఖ్యతను మావోయిస్టులు ప్రస్తావించారు. ‘‘ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఆదివాసీ ప్రజలతో పాటు అన్ని వర్గాల ప్రజలు వచ్చి ఆరాధ్య దైవంగా పూజిస్తారు. ఆదివాసీ ప్రజలపై కాకతీయ రాజులు అధిక పన్నులు విధించి వాటిని చెల్లించాలని ఒత్తిడి చేశారు.
ఆ పన్నులు మేము చెల్లించలేమని సమ్మక్క, సారలమ్మలు రాజుకు వ్యతిరేకంగా పోరాడుతూ అసువులుబాసారు. అప్పటి నుంచి ఆదివాసీ ప్రజలంతా సమ్మక్క, సారలమ్మలను ఆరాధ్య దైవంగా పూజిస్తున్నారు.’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు మేడారం జాతర పూర్తిగా ఆదివాసీ సంప్రదాయాలతో నిర్వహించాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు.
హిందూ సంప్రదాయాలైన లడ్డు, పులిహోర కాకుండా బెల్లాన్ని ప్రసాదంగా ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. జాతర ముగిసిన వెంటనే స్థానికులకు వ్యాధులు రాకుండా పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. జాతరకు నాలుగు రాష్ట్రాల నుంచి కోటికి పైగా ప్రజలు వస్తారని, ఈ భక్తుల ద్వారా ప్రభుత్వానికి పెద్దఎత్తున నిధులు వస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ నిధులను ఆదివాసీల అభివృద్ధికి ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. భక్తులకు పూర్తి సౌకర్యాలు కల్పించాలని లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా జాతర పనుల కోసం విడిచిపెట్టిన పంట పొలాలకు నష్టపరిహారం ఇవ్వాలి. పంట పొలాల్లో రకరకాల వ్యర్థ పదార్థాలన్నింటిని తీసి వేసే బాధ్యత ప్రభుత్వమే తీసుకుని చేయాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు.