మేడారం జాతర(Medaram Jatahara)లో తొలిఘట్టం నిర్విఘ్నంగా పూర్తయింది. కన్నెపల్లి నుంచి వచ్చిన సారలమ్మ బుధవారం అర్ధరాత్రి 12.12 గంటలకు గద్దెను అలంకరించారు. పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు తరలి వచ్చి మేడారం గుడి దగ్గరకు సారలమ్మ(Saralamma)కు ఘన స్వాగతం పలికారు.
సమ్మక్క సారలమ్మ(Sammakka Saralamma Jathara)జాతర మొదటిరోజే గద్దెల పరిసర ప్రాంతాలు భక్తులతో రద్దీగా మారింది. రాష్ట్రంతో పాటు ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో మేడారం పరిసరాలు ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోయాయి. వేలాది మంది భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి గద్దెల దర్శనానికి బారులు దీరడంతో క్యూలైన్లు పూర్తిగా కిక్కిరిసిపోయాయి.
సారలమ్మను తోడ్కోని వచ్చే ప్రధాన వడ్డె (పూజారి) కాక సారయ్య సహా ఆయనను అనుసరించే ఇతర వడ్డెలు గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక, పూజల తర్వాత కన్నెపల్లి నుంచి 16 మంది ఆడబిడ్డలు వచ్చి సంప్రదాయం ప్రకారం డోలి విన్యాసాలతో సమ్మక్క- సారలమ్మ కొలువుదీరే గద్దెలపై ముగ్గులు వేసి కంకవనానికి కంకణాలు కట్టారు.
అదేవిధంగా, జాతరలో అత్యంత కీలక ఘట్టమైన సమ్మక్క ఆగమనం ఇవాళ జరగనుంది. చిలకలగుట్టపై నుంచి కుంకుమభరిణె రూపంలో ఉండే సమ్మక్కను పూజారులు అధికార లాంఛనాల మధ్య తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించబోతున్నారు. సమ్మక్క రాక నేపథ్యంలో భక్తుల సంఖ్య భారీగా పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు భావిస్తున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేశారు.
మధ్యాహ్నం 3 గంటల నుంచే కన్నెపల్లి సారలమ్మ గుడి దగ్గర డోలి విన్యాసాలు, తుడుందెబ్బ, ఆదివాసీ విద్యార్థి పరిషత్, సారలమ్మ యువజన సంఘం బృందాల సారథ్యంలో కళా ప్రదర్శనలు జరగనున్నాయి. అదే సమయంలో సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య సహా ఇతర పూజారులు సారలమ్మ గుడిలో వారి ఆచార సంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించనున్నారు. మరోవైపు, కేంద్ర పర్యటకశాఖ మంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేడు మేడారానికి చేరుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు.