మిచాంగ్ తుపాన్(Cyclone Michaung) ప్రభావంతో తమిళనాడు రాజధాని చెన్నైలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ తుపానుతో ముంచెత్తిన వరదలు 2015లో వచ్చిన జల ప్రళయాన్ని గుర్తుచేస్తోంది. తాము కనీస అవసరాలు తీర్చుకోలేకపోతున్నామని, పెద్దఎత్తున విద్యుత్ కోతలను ఎదుర్కొంటున్నామని నగర వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మడిపాక్కం ప్రాంతంలో కరెంటు కోతల కారణంగా భోజనం వండుకోలేకపోతున్నామని స్థానికులు వాపోతున్నారు. అక్కడి 97 ఏళ్ల ఓ వృద్ధుడు నాలుగు రోజులుగా సరిగా భోజనం చేయలేదని, కరెంటు కోతల కారణంగా భోజనం వండలేదని కుటుంబసభ్యులు తెలిపారు. చెన్నై నగర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులో నెలకొనడంతో దయనీయ పరిస్థితులు ఏర్పడ్డాయి.
సమయానికి ఆహారం లేకపోవడంతో వృద్ధులు, పిల్లలు బలహీనపడిపోతున్నారు. మంగళవారం తీరాన్ని తాకిన మిచాంగ్ తుపాను కారణంగా చెన్నైలో ఇప్పటివరకు 17 మంది మృతి చెందారు. ఇదిలా ఉండగా ప్రస్తుత పరిస్థితులు 2015 నాటి వరదలను మళ్లీ గుర్తుకు తెచ్చాయని, ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని పలువురు అంటున్నారు.
2015లో వచ్చిన వరదలు చెన్నై(Chennai Floods) నగర వాసులను అతలాకుతలం చేశాయి. వరదలు మిగిల్చిన విషాదం నుంచి బయటపడటానికి చాలా కాలం పట్టింది. ఇప్పుడు సరిగ్గా అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ప్రజలు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల కారణంగా అన్ని రహదారులు జలమయమవడంతో ప్రజలు సాధారణ జీవనం గడపడానికి ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు చెన్నైలోని పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం శుక్రవారం కూడా సెలవు ప్రకటించింది.
మరోవైపు తుఫాన్ ప్రభావం నుంచి కోలుకోని తమిళనాడుకు భారత వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది. శుక్ర, శనివారాల్లో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ‘రాబోయే 5 రోజుల్లో కేరళలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, లక్షద్వీప్‌లో వచ్చే మూడు రోజుల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని తెలిపారు. దీంతో చెన్నై, కేరళ వాసులు ఆందోళన చెందుతున్నారు.