మిచాంగ్ తుపాన్ (Michaung Cyclone).. తీరం దాటింది. ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వరద(Heavy Floods)తో జన జీవనం స్తంభించింది. చీరాల, బాపట్ల మధ్య తుపాను తీరం దాటింది. ఈ సమయంలో 110 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచాయి. గాలుల తీవ్రతకు చెట్లు కూలిపోయాయి.. విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయాయి. కరెంట్ సరఫరా నిలిచింది.
మచిలీపట్నం(Machilipatnam) నుంచి చెన్నె(Chennai) వరకు సముద్రం 30 మీటర్లు ముందుకు వచ్చింది. 2023, డిసెంబర్ 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో నెల్లూరు, కావలి మధ్య తీరాన్ని తాకిన మిచాంగ్ తుఫాన్.. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో బాపట్ల, చీరాల మధ్య తీరాన్ని దాటింది. తీరం దాటిన సమయంలో గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
ఏపీలోని 10 జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులకు తీవ్ర నష్టం వచ్చింది. తీరం సమీపంలో రోడ్లపై ఉన్న చిన్న తాత్కాలిక దుకాణాలు, తీరానికి 10 కిలోమీటర్ల పరిధిలోని ఉన్న గ్రామాల్లోని పూరిళ్లు ఈదురుగాలులకు కొట్టుకుపోయాయి. జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. వందల సంఖ్యలో రైలు సర్వీసులను రద్దు చేశారు.
ఇప్పటికే బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో వాగులు, నదులు పొంగి పొర్లుతున్నాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తిరుపతి, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లోనూ తుఫాన్ ప్రభావం మరీ ఎక్కువగా ఉంది. రాబోయే 24 గంటలు తుఫాన్ ప్రభావం ఉంటుందని అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.