అణ్వాయుధ దేశమైన ఉత్తర కొరియా నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో దక్షిణ కొరియా(South Korea) అప్రమత్తమవుతోంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అన్నివిధాలుగా సిద్ధమైంది. ఇందులో భాగంగా కిమ్ కిగ్డమ్ (North Korea) చర్యలపై ఓ కన్నేసి ఉంచేందుకు సైనిక గూఢచార ఉపగ్రహాన్ని (Militar Spy Satellite) రోదసీలోకి ప్రయోగించి తమ బలాన్ని చూపించింది.
గత వారం ఉత్తర కొరియా సైనిక గూఢచార ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపించిన విషయం తెలిసిందే. ఆ ఉపగ్రహం పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. ప్యాంగాంగ్‌లో గత నెల 28న ప్రయోగించింది. ఈ నేపథ్యంలో తాజాగా దక్షిణ కొరియా కూడా సైనిక ఉపగ్రహాన్ని ప్రయోగించడం విశేషం.
2025 నాటికి మరో నాలుగు గూఢచార ఉపగ్రహాలను పంపించడానికి దక్షిణ కొరియా లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దక్షిణ కొరియా తమ స్వదేశీ పరిజ్ఞానంతోనే ఈ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. ఇది కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్‌లో ఉన్న యూఎస్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్లలో ఒకటి.
దీంతో నార్త్ కొరియాపై నిఘా ఉంచేందుకు రూపొందించిన తొలి సైనిక గూఢచార ఉపగ్రహాన్ని సౌత్ కొరియా ప్రయోగించింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 10.19 గంటలకు ఈ ప్రయోగం జరిగింది. కేవలం నాలుగు నిమిషాల వ్యవధిలోనే ఈ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టామని సౌత్ కొరియా రక్షణ శాఖ ప్రకటించింది. 11.37 గంటలకు ఉపగ్రహం నుంచి గ్రౌండ్ స్టేషన్‌కు సిగ్నల్స్ అందినట్లు తెలిపింది.