ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi Liquor scam case)లో తన పేరు రావడంపై మంత్రి అతిషి ఇవాళ స్పందించారు. ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ బీజేపీ(BJP)పై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కమలం పార్టీలో చేరకుంటే అరెస్టు చేస్తామని బెదిరించారని సంచలన ఆరోపణలు చేశారు.
ఈడీ అధికారులు సీఎం కేజ్రీవాల్‌ను సోమవారం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన సంగతి తెలిసిందే. విజయ్ నాయర్‌తో ఉన్న సంబంధాల గురించి కేజీవాల్‌ను ప్రశ్నించగా నాయర్ తనకు నివేదించలేదని మంత్రులు అతిషి, సౌరభ్‌కు నివేదించారని కేజ్రీవాల్ చెప్పారని ఈడీ పేర్కొంది. లిక్కర్ కుంభకోణంలో అతిషి, సౌరభ్ భరద్వాజ్ పేర్లను కూడా ఈడీ ప్రస్తావించడం ఇదే తొలిసారి.
దీనిపై తాజాగా మంత్రి అతిషి స్పందిస్తూ లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో తనకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి ద్వారా బీజేపీ సంప్రదింపులు జరిపిందని చెప్పుకొచ్చారు. నెల రోజుల సమయం ఇచ్చి ఆలోచించుకోమన్నారని, తనతో పాటు దుర్గేష్ పాఠక్, రాఘవ్ చద్దా, సౌరభ్ భరద్వాజ్‌లనూ అరెస్టు చేస్తామని చెప్పారని ఆరోపించారు. అంతేకాదు మరో నలుగురు ఆప్ నేతలనూ బీజేపీ అరెస్టు చేయాలని భావిస్తోందని చెప్పుకొచ్చారు.
అయితే, సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ విచ్ఛిన్నమవుతుందని బీజేపీ ఊహించిందని మంత్రి అతిషి అన్నారు. ఆప్‌కి చెందిన నలుగురు నేతలను అరెస్ట్ చేయడం సరిపోదని.. ఇప్పుడు మరో నలుగురిని అరెస్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తుందని ఆమె ఆరోపించారు. మరికొన్నిరోజుల్లో ఈడీ, సీబీఐ ఆప్ నేతలకు సంబంధించిన పలువురిని అరెస్ట్ చేయాలని బీజేపీ చూస్తోందంటూ మంత్రి అతిషి ఆరోపించడం గమనార్హం.