తెలంగాణ (Telangana) అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy). సికింద్రాబాద్, అంబర్ పేట పరిధిలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. లాలాపేట్ – సత్యనగర్ అప్రొచ్ రోడ్డును ప్రారంభించారు. సత్యనగర్, ఇందిరానగర్, శ్రీపురి కాలనీ, లక్ష్మి నగర్, కృష్ణా నగర్, చంద్రబాబు నగర్ ప్రజలు ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ప్రజల అభ్యర్థన మేరకు ఇచ్చిన హామీని నెరవేర్చానని చెప్పారు.
హైదరాబాద్ (Hyderabad) వాసుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు కిషన్ రెడ్డి. వేల కాలనీల్లో సరైన రోడ్లు, పారిశుద్ధ్యం, తాగునీరు, ఇతర వసతులు లేవన్నారు. రోడ్ల మీద ఫ్లైఓవర్లు కడుతూ హైదరాబాద్.. సింగపూర్, డల్లాస్ అయినట్లు మభ్యపెడుతోందని విమర్శలు గుప్పించారు. సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ కార్యకర్తలకు తప్ప.. ఇంకెవరికీ అందడం లేదని ఆరోపించారు. పేదలు రేషన్ కార్డులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందారు.
రైల్వే ఆస్తుల పరిధిలో ఉన్న రోడ్లు, దేవాలయాల అభివృద్ధి అంత సులభం కాదని.. కానీ ఆ శాఖతో మాట్లాడి పనులు పూర్తి చేశామన్నారు. ప్రతీ కుల వృత్తులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉందని.. లోన్ కూడా మంజూరు చేశారని చెప్పారు. హైదరాబాద్ చుట్టూ ట్రిపుల్ ఆర్ రోడ్డును రూ.26 వేల కోట్లతో మంజూరు చేశామని.. ఇప్పుడు ఆ రోడ్డు చుట్టూ రిజినల్ రైలు లైన్ కూడా మంజూరైందన్నారు. ఈ నిర్మాణం పూర్తయితే పేదలకు ఇంటి వసతి.. ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హైదరాబాద్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని భూసేకరణ త్వరగా చేపట్టి మోడీ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని ఆరోపించారు.
ఇక, అంబర్ పేటలో సేవా భారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంపును కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నగరానికి మూడు వైపులా హాస్పిటల్స్ కడుతామని హామీ ఇచ్చిందని.. కొత్త వాటి సంగతి దేవుడెరుగు.. ఉస్మానియా ఆస్పత్రిలో కనీస వసతులు లేవని మండిపడ్డారు. వర్షం వస్తే మూసీ నీరు హాస్పిటల్ లోపలికి వస్తోందని.. ఇలా రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ప్రజలకు వైద్య సాయం అందించే విషయంలో కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని అన్నారు. ఆయుష్మాన్ భారత్ కింద నచ్చిన హాస్పిటల్ లో పేదలు చికిత్స చేయించుకునే అవకాశం ఏర్పరించిందని వివరించారు.