సీఎం కేసీఆర్ (CM KCR) కృషితో గోదావరి జలాలు ఇతర జిల్లాలకు వచ్చాయన్నారు మంత్రి కేటీఆర్ (KTR). శుక్రవారం సిరిసిల్ల జిల్లాలో ఆయన పర్యటించారు. సిరిసిల్లలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకనాడు సిరిసిల్ల ప్రాంతానికి వస్తే చుక్క నీరు కూడా కనపడేది కాదన్నారు. కానీ, ఇవాళ గోదావరి నీటితో రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయని చెప్పారు.
గత పాలకులు ఏనాడూ ఇక్కడి ప్రజల సమస్యలను తీర్చడంపై దృష్టి పెట్టలేదన్నారు కేటీఆర్. కానీ, సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ప్రతీ ఎకరానికి నీరందిందే గొప్ప లక్ష్యాన్ని భుజానికి ఎత్తుకొని పూర్తి చేశారని చెప్పారు. పని చేసే ప్రభుత్వాన్ని, పని చేసే ముఖ్యమంత్రిని అందరూ కడుపులో పెట్టుకొని ఆశీర్వదించాలని కోరారు. ఈత వనాలు, తాటి వనాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. టాటా బిర్లా కాదు తాతల నాటి కుల వృత్తులు బాగుండాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని అధికారికంగా జరుపుతుందని వెల్లడించారు. ‘‘ఆత్మ గౌరవం కోసం ఆయన పోరాటం చేశారు.. 10 మందితో మొదలైంది ఆయన సైన్యం, చివరగా గోల్కొండ కోటపై జెండా ఎగురవేసారు.. తెలంగాణ పోరాటం కూడా అదే విధంగా జరిగింది’’ అని అన్నారు. తమది పని చేసే ప్రభుత్వమన్న కేటీఆర్.. 55 ఏళ్లు కరెంట్, సాగునీరు, కోసం ఇబ్బంది పడ్డామని గుర్తు చేశారు.
ఇక సిరిసిల్లలో బోటింగ్ ఓపెన్ చేయడంతో పాపికొండలు లాగా మారిందన్నారు కేటీఆర్. మల్కపేట నుంచి సింగ సముద్రం నుంచి నీళ్ళు వస్తాయి.. శాశ్వతంగా 365 రోజులు నీళ్ళు ఉండేలా చేస్తున్నామని చెప్పుకొచ్చారు. అంతకుముందు.. పర్యాటకులను ఆకట్టుకునేలా మధ్య మానేరు జలాశయం అందాలను వీక్షిస్తూ బోటింగ్ చేసేందుకు వీలుగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోటింగ్ యూనిట్ ను ప్రారంభించారు. సిరిసిల్ల మానేరు కరకట్ట వద్ద పర్యాటక శాఖ ద్వారా ఏర్పాటు చేసిన నూతన బోటును మంత్రి నడిపారు.