పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజనపై ప్రధాని మోడీ (PM Modi) చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్(KTR)తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ(Telangana) ఏర్పాటుపై ప్రధాని మోడీ వ్యాఖ్యలు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించాయన్నారు. కాంగ్రెస్‌ను విమర్శించే ప్రయత్నంలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రధాని మోడీ అవమానిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
తెలంగాణ ఏర్పాటును మోడీ అవమానించడం ఇదే మొదటి సారి కాదన్నారు. గతంలోనూ మోడీ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆయన గుర్తు చేశారు. చారిత్రక వాస్తవాల పట్ల మోడీ నిర్లక్ష్యానికి ఇది అద్దం పడుతోందని ఫైర్ అయ్యారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు ఆరు దశాబ్దాల పాటు పోరాటం చేశారన్నారు.
స్వరాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు చేసిన త్యాగాలు, భావోద్వేగాలను ప్రధాని పరిగణించాలని మంత్రి సూచించారు. తెలంగాణ ప్రజలు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను జరుపుకోలేదనడం పూర్తిగా అవాస్తవమని ఆయన ఖండించారు. మోడీ వ్యాఖ్యలు అజ్ఞానం, అహంకార పూరితంగా ఉన్నాయంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు.
తల్లిని చంపి బిడ్డను తీశారంటూ ఇంకెన్ని సార్లు అలా అజ్ఞానంతో తమ అస్థిత్వాన్ని అవమానిస్తారంటూ ప్రశ్నించారు. వడ్లు కొనాలని అడిగితే నూకలు బుక్కాలని.. తెలంగాణ రైతుల్ని మోడీ కించపర్చిండన్నారు. ప్రజాస్వామ్య దేవాలయంలో ప్రతిసారీ పనిగట్టుగొని మరి తమ ఆత్మగౌరవాన్ని గాయపర్చి ఎందుకు ఆనందిస్తున్నారు..?అని నిలదీశారు.
తెలంగాణ మీద ప్రధానికి పదే..పదే అదే అక్కసు ఎందుకని ఆయన ప్రశ్నించారు. అమృతకాల సమావేశాలని పేరు పెట్టి విషం చిమ్మడం ఏం సంస్కారం..? అని ఆయన నిలదీశారు. తెలంగాణ రాష్ట్రమంటే గిట్టనట్టు.. మమ్మల్ని పగబట్టినట్టు.. మా పుట్టుకను ప్రశ్నించడం పద్ధతేనా..? అని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోటి ఆశలు కొత్త ఆకాంక్షలతో తెలంగాణ పురుడుపోసుకుందన్నారు. తమకు సహకరించక పోగా మొదటి నుంచి ఈ రాష్ట్ర ప్రజలపై కక్షను పెంచుకున్నారంటూ తీవ్రంగా విమర్శించారు. ఏడు మండలాలను లాక్కొని.. లోయర్ సీలేరు ప్రాజెక్టును గుంజుకుని పురిట్లోనే మీరు చేసిన తొలి ద్రోహాన్ని మరచిపోలేమంటూ తీవ్రంగా విరుచుకపడ్డారు.
ఐటీఐఆర్‌ను రద్దు చేస్తరన్నారు. హైదరాబాద్‌కు ఆర్బిట్రేషన్ సెంటర్ వస్తే ఓర్వలేదన్నారు బయ్యారంలో ఉక్కు ఫాక్టరీకి ఉరేసి.. గిరిజన వర్సిటీ పెట్టకుండా నానబెట్టారన్నారు. ఆదివాసులపై ఎందుకు కక్షసాధిస్తున్నారని అడిగారు. సింగరేణి బొగ్గుబావులను వేలం వేస్తరన్నారు.
కృష్ణాలో నీటి వాటాలు తేల్చకుండా గత పదేండ్లుగా దక్షిణ తెలంగాణ రైతులను దగాచేస్తున్నారని ఆరోపించారు. మీ పగను ఎట్లా అర్థంచేసుకోవాలి..? అని అన్నారు. కాజీపేట కోచ్ ఫాక్టరీని గుజరాత్‌కు తరలించుకుపోయి దశాబ్దాల కలని కల్లలు చేసిన మీ దుర్మార్గాన్ని క్షమించగలమా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.