తమ సమస్యలు పరిష్కరించాలంటూ కొన్నాళ్లుగా ఆశావర్కర్లు నిరసనలు చేపడుతున్నారు. కలెక్టరేట్ల ముందు న్యాయం చేయాలని ధర్నాలు చేస్తున్నారు. అధికారులను కలిసి వినతి పత్రాలు అందజేస్తున్నారు. చాలాకాలంగా నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. శుక్రవారం వరంగల్ పర్యటనలో మంత్రి కేటీఆర్ ఆశావర్కర్లను కలిశారు. మంత్రి పిలుపుతో తమ సమస్యలు పరిష్కారం అవుతాయని వారు భావిస్తే.. ఇప్పుడే కాదు ఆఫ్టర్ ఎలక్షన్ అంటూ ఆయన చెప్పి వెళ్లిపోవడంతో నిరాశ చెందారు.
ఆశా వర్కర్లు, మిడ్ డే మీల్స్ కార్మికులతో మాట్లాడిన కేటీఆర్.. వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లు, సీఐటీయూ నేత రమేష్ పై మండిపడ్డారు. పనిలేని వాళ్లంతా సంఘాలు పెట్టి రోడ్లపైకి వస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆశా వర్కర్లకు ఎక్కవ గౌరవ వేతనం ఇస్తున్నామని చెప్పారు. ఎన్నికలే లక్ష్యంగా నిరసనలు చేయడం పద్దతి కాదన్న ఆయన.. ఎన్నికల తర్వాత ఆశాల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి వెళ్లిపోయారు.
మరోవైపు, తెలంగాణలో ఆశావర్కర్ల నిరసనలు కొనసాగుతున్నాయి. వరుసగా 12వ రోజు జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు.