హైదరాబాద్ నగర అభివృద్ధిపై మరోసారి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు మంత్రి కేటీఆర్. బుధవారం మన నగరం కార్యక్రమంలో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ సభలో ప్రసంగించారు. నగర విస్తరణ, సమస్యలపై మాట్లాడారు. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని వివరించారు.
హైదరాబాద్ నగరంలోని సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు కేటీఆర్. వచ్చే వందేళ్లకు తగినట్లుగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. కొత్తగా 314 కిలోమీటర్ల మెట్రో మార్గానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని వివరించారు. గృహలక్ష్మి పథకం కూడా ప్రారంభిస్తామన్న ఆయన.. నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో లింక్ త్వరలో ప్రారంభిస్తామని ప్రకటించారు.
హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు సిద్ధమయ్యాయన్నారు కేటీఆర్. ఈనెల 15వ తేదీ నుంచి ఇళ్ల పంపిణీ జరుగుతుందని తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో 40 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని వెల్లడించారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మామూలు వ్యక్తి కాదని.. అనుకున్న పనిని చేసి చూపిస్తారని కొనియాడారు కేటీఆర్.
జీవో 118 కింద రెగ్యులరైజ్ చేసిన పట్టాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు మంత్రి. నగరంలో జీవో నెంబర్ 58, 59 కింద లక్ష పైచిలుకు కుటుంబాలకు పట్టాలు వస్తేనే ఎల్బీనగర్ నియోజకవర్గంలోనే 11 వేలకు పట్టాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. జీవో 118 ప్రకారం ఒక్కొక్కరికి గరిష్టంగా వెయ్యి గజాల వరకు నిర్మాణాలతో కూడిన స్థలాన్ని క్రమబద్ధీకరించారు.