– ఈ గట్టున స్కీములు
– ఆ గట్టున స్కాములు
– ఇటేమో ప్రజాసంక్షేమం
– అటేమో 60 ఏండ్ల వినాశనం
– కాంగ్రెస్ ను నమ్మితే నట్టేట మునగడమే!
– బీజేపీదీ ఇదే బుద్ధి
– మంత్రి కేటీఆర్ ఆగ్రహం
తెలంగాణ (Telangana) లో అభివృద్ధి జరగనట్టు కొందరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు మంత్రి కేటీఆర్ (KTR). వరంగల్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. విపక్షాలపై మండిపడ్డారు. ఈ గట్టున స్కీములు ఉంటే.. ఆ గట్టున స్కాములు ఉన్నాయన్నారు. ఈ గట్టున ప్రజాసంక్షేమం ఉందని.. ఆ గట్టున 60 ఏండ్లు జనాన్ని పీక్కు తిన్నవారు ఉన్నారని విమర్శించారు. వరంగల్ కు ఐటీ కంపెనీలు వస్తున్నాయని.. ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు.
వరంగల్ లో అతిపెద్ద హాస్పిటల్ నిర్మిస్తున్నామని.. దసరా నాటికి పూర్తవుతుందని తెలిపారు కేటీఆర్. జూనియర్, డిగ్రీ కాలేజీలు కావాలంటే ఒకప్పుడు ధర్నాలు, యుద్ధాలు జరిగేవని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. అన్ని జిల్లాల్లో బ్రహ్మాండంగా మెడికల్ కాలేజీలు వచ్చాయని చెప్పారు. మన పిల్లలు మన కండ్ల ముందే ప్రభుత్వ ఖర్చుతో డాక్టర్లు అయ్యే పరిస్థితి ఏర్పడిందని వివరించారు. తొమ్మిదిన్నరేండ్లలో ఎంతో అభివృద్ధి చేశామని… కాంగ్రెస్ పాలనలో కరెంట్ కష్టాలను గుర్తు చేసుకోవాలన్నారు.
కరెంట్ గురించి సిగ్గు లేకుండా కాంగ్రెసోళ్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు కేటీఆర్. ‘‘కరెంట్ కనపడడం లేదట.. అది తీగల్లో ఉంటది. చూసేందుకు కేసీఆర్ లాగా సన్నగా ఉంటది. కానీ, ముట్టుకుంటే, జాడిచ్చే తంతే. అవతల పడ్తారు’’ అని అన్నారు. 60 ఏండ్లు మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు మాయమాటలు చెబుతూ మొసలి కన్నీరు కారుస్తోందని దుయ్యబట్టారు. ఇక, తెలంగాణ మీద మోడీ విషం చిమ్మారని మండిపడ్డారు కేటీఆర్. తల్లిని చంపిండ్రు బిడ్డను వేరు చేసిండ్రు అని మన పోరాటాన్ని కించపరిచేలా మాట్లాడారన్నారు.
అంతకుముందు, వెస్ట్ మారేడ్ పల్లిలోని పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు కేటీఆర్. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 27 వేల స్కూళ్లలో 23 లక్షల మందికి ఈ పథకంతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు. బంగారు తెలంగాణలో భావితరాలు పౌష్టికంగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో విద్యార్థులకు విద్యతో పాటు వారి ఆరోగ్యాన్ని పరిగణనలోనికి తీసుకొని ఈ పథకానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ కమిషనర్ కు మంత్రి కొన్ని సూచనలు చేశారు. క్వాలిటీ ఎప్పటికప్పుడు ర్యాండమ్ చెకింగ్ చేసి నాణ్యతపై దృష్టి పెట్టాలని సూచించారు కేటీఆర్.