జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనేది కేసీఆర్ (KCR) భావన. అందుకే ఒక్కో రాష్ట్రంలో సత్తా చాటాలని ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రస్తుతం మహారాష్ట్రపై ఫుల్ ఫోకస్ పెట్టారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ (BJP Govt) ను గద్దె దించడమే తమ లక్ష్యమని ఇప్పటికే ప్రకటించారు. దీనికి తగినట్టే బీఆర్ఎస్ (BRS) నేతలు వీలు చిక్కినప్పుడల్లా మోడీ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారు. విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ (KTR) కేంద్రంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చేనేత వద్దు.. అన్నీ రద్దు అనేలా కేంద్రం తీరు ఉందని ధ్వజమెత్తారు.
హైదరాబాద్ మన్నేగూడలో జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమం జరిగింది. దీనికి మంత్రి కేటీఆర్ హాజరై ప్రసంగించారు. ఈ ఆగస్టు, సెప్టెంబర్ నెలలోనే చేనేత మిత్ర పథకం అమలు అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. నేతన్నల విజ్ఞప్తి మేరకు ఈ పథకం తెచ్చినట్లు తెలిపారు. చేనేత మిత్ర కింద ప్రతి కార్మికుడికి, ప్రతి మగ్గానికి నెలకు రూ.3 వేల రూపాయల చొప్పున వారి బ్యాంక్ అకౌంట్ లో డైరెక్ట్ గా జమ చేస్తామని ప్రకటించారు.
ఈ సందర్భంగా కేంద్రంపై విరుచుకుపడ్డారు కేటీఆర్. మోడీ సర్కారుపై దేశ ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. ఈసారి కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనన్నారు. కొత్త ప్రభుత్వంలో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కొత్త సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేనేత వస్త్రాలపై ఉన్న జీఎస్టీని పూర్తిగా రద్దు చేయిస్తామని హామీ ఇచ్చారు.
చేనేత మీద 5 శాతం జీఎస్టీ వేసిన మొట్టమొదటి ప్రధాని మోడీనే అని మండిపడ్డారు కేటీఆర్. కేంద్రం చేనేతకారులపై మరిన్ని భారాలు వేస్తోందని.. చేనేత కార్మికుల గురించి సీఎం కేసీఆర్ కు తెలిసినంత ఎవరికీ తెలియదని తెలిపారు. చేనేత కార్మికులను కాపాడుకుంటానని 2001లోనే కేసీఆర్ చెప్పారని.. ఇచ్చిన మాట ప్రకారం అండగా నిలుస్తున్నారని వివరించారు. మృతి చెందిన కార్మికుల కుటుంబానికి టెస్కో సాయం రూ.25 వేలకు పెంచుతామని తెలిపారు. నేతన్నల కోసం చేనేత హెల్త్ కార్డు ప్రారంభిస్తున్నామని చెప్పారు కేటీఆర్.