బీజేపీ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) లోక్ సభ ప్రసంగంపై బీఆర్ఎస్ (BRS) నేతలు మండిపడుతున్నారు. వరుసగా విమర్శల దాడికి దిగుతున్నారు. మంత్రి కేటీఆర్ (KTR) ట్విట్టర్ లో స్పందిస్తూ.. లోక్ సభ స్పీకర్ ను ప్రశ్నించారు. రాహుల్ అనర్హత అంశాన్ని ప్రస్తావిస్తూ సంజయ్ పై మండిపడ్డారు.
‘ప్రధాని ఇంటిపేరును అవమానించారని కాంగ్రెస్ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేశారు కదా.. ఇప్పుడు తెలంగాణకు చెందిన ఒక బీజేపీ ఎంపీ లోక్ సభలో రాష్ట్రానికి రెండు సార్లు ఎన్నికైన పాపులర్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అత్యంత నీచమైన భాషలో దూషించారు. ఇప్పుడు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఏం చేస్తారు?’ అని ట్వీట్ చేశారు కేటీఆర్.
అంతకుముందు ఎమ్మెల్సీ కవిత (Kavitha) కూడా స్పందిస్తూ.. బండిపై ఫైరయ్యారు. తెలంగాణ కోసం ఒక మంచి మాట మాట్లాడలేదని.. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా రాలేదన్నారు. అవకాశం వచ్చినప్పుడు ప్రజల కోసం మాట్లాడాలి గానీ.. తిట్టడమే పనిగా పెట్టుకుంటారా? అని అడిగారు. 24 గంటల కరెంట్ వస్తుందో లేదో.. కరీంనగర్ బీజేపీ ఆఫీస్ లేదా హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ కు వెళ్లి కరెంట్ తీగలు పట్టుకోమని సెటైర్లు వేశారు.
కేటీఆర్, కవిత వ్యాఖ్యలకు కౌంటర్ ట్వీట్ చేశారు బండి సంజయ్. ట్విటర్ టిల్లు.. ప్రజలను దోచుకోవడం ద్వారా మీ కుటుంబ ఆదాయం ఎలా పెరిగిందనేది కూడా వారు చూస్తున్నారు.. అందుకే మీరు వణికిపోతున్నట్లున్నారని ఎద్దేవ చేశారు. పైకి, శత్రువుల్లాగా నటిస్తూ ఢిల్లీలో కాంగ్రెస్, ఎంఐఎంతో దోస్తీ చేస్తున్నది కూడా గమనిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కు వేసినట్లేనని.. ఆర్టీసీ కార్మికులను ఇన్నిరోజులు విస్మరించిన కేసీఆర్.. కేవలం ఎన్నికలు వస్తున్నాయనే ప్రభుత్వంలో విలీనం చేశారని ఆరోపించారు సంజయ్.