తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly Elections) నేపథ్యంలో రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రచారం ఊపందుకోగా అభ్యర్థులు ఎన్నికల్లో ప్రలోభాలకు పాల్పడుతున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పలువురు నేతలపై ఫిర్యాదులు కూడా ఇచ్చాయి.
తాజాగా మంత్రి సత్యవతి రాఠోడ్(minister satyavathi Rathod)పై కూడా ఇలాంటి ఫిర్యాదే వచ్చింది. దీంతో గూడూరు పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. మహబూబాబాద్ జిల్లాలోని కొంగరగిద్దలో మంత్రి సత్యవతి రాఠోడ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్‌కు మద్దతుగా ప్రచారం చేశారు.
మంత్రికి స్థానిక మహిళలు మేళతాళాలు, డప్పచప్పుళ్లు, మంగళ హారతులతో స్వాగతం పలికారు. అయితే మంత్రి.. మంగళహారతి పళ్లెంలో రూ.4వేలను ఉంచారు. దీంతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకే ఆమె డబ్బు ఇచ్చారంటూ ప్రతిపక్ష నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మంత్రి సత్యవతి రాఠోడ్‌పై కేసు నమోదు చేశారు.
ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ పలు హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మంత్రి సత్యవతి రాథోడ్ హారతి పళ్లెంలో డబ్బులు వేస్తే కేసు నమోదు కావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.