మోడీ ప్రభుత్వం(Modi Government)లో పుట్టినా పన్ను.. చచ్చినా పన్ను అని మంత్రి సీతక్క(Minister Seethakka) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా(Adilabad District) జైనాథ్, బేల మండలాల్లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీజేపీ(BJP)పై విమర్శలు గుప్పించారు.
పదేళ్లలో బీజేపీ చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు దేవుళ్లను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి గురించి అడిగితే అయోధ్యలో రామాలయాన్ని చూపిస్తున్నారని అన్నారు. అసలు బీజేపీ రామాలయానికి ఇచ్చిన నిధులేంటో చెప్పాలని నిలదీశారు. మోడీ వచ్చాక మహిళలు బంగారం తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళలు కట్టుకునే చీరలపైనా జీఎస్టీ విధించారని దుయ్యబట్టారు. పన్నుల రూపంలో పేదలను మరింత కష్టాల్లోకి నెడుతున్నారని అన్నారు. తినే తిండిపై, కట్టుకునే బట్టపై పన్నులు విధిస్తోందన్నారు. గతంలో గెలిపించిన బీజేపీ ఎంపీలను ఇక్కడ ఏం చేశారని నిలదీయాలని ప్రజలకు సూచించారు. అదేవిధంగా మాజీ సీఎం కేసీఆర్‌పై సీతక్క సెటైర్లు వేశారు. కేసీఆర్ రూ.7లక్షల కోట్ల అప్పులు చేసి పోయాడని అన్నారు.
పెదోళ్ళకి కరెంట్ కట్ చేసి ఫాం హౌస్‌లకు కరెంట్ ఫ్రీగా ఇచ్చాడని దుయ్యబట్టారు. మాట ఇస్తే మడమ తిప్పని పార్టీ కాంగ్రెస్ అని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అంటేనే ఉచిత కరెంట్ కు పేటెంట్ అన్నారు. ఉపాధి హామీ పథకం కాంగ్రెప్ పార్టీ తెచ్చిందేనని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి దమ్మున్న నాయకుడని, ఇచ్చిన మాట నిబెట్టుకొనే మనిషి చెప్పుకొచ్చారు. ఎన్నికలు పూర్తవగానే రుణమాఫీ చేసితీరుతామని హామీ ఇచ్చారు. రైతుబంధు రాని వారు అధైర్యపడొద్దని సీతక్క సూచించారు.