తెలంగాణ రాజకీయాల్లో నేతల మధ్య ఘాటు విమర్శలు చోటు చేసుకొంటున్నాయి. ఇంత కాలం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పై కాంగ్రెస్ మాటల తూటాలు వదిలేది. ఇప్పుడు సీన్ రివర్స్.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పై బీఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు. ఎక్కువగా కేటీఆర్.. హరీష్ రావు దూకుడుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు సైతం తక్కువ తినలేదన్నట్టు మాటకు మాట.. పంచ్ లకు పంచ్ లు వదులుతున్నారు..
ఈ క్రమంలో సర్పంచ్ ల మ్యాటర్ తెరపైకి రావడంతో తెలంగాణ మంత్రి సీతక్క(Minister Sitakka), కేటీఆర్ (KTR)పై శివమెత్తారు.. వెయ్యి పశువులను తిన్న రాబందు నీతి కథలు చెప్పినట్టు కేటీఆర్ చెబుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ (BRS) హయాంలో సర్పంచ్ లకు నిధులు ఇవ్వకుండా అరిగోస పెట్టిన కేటీఆర్… ఇప్పుడు సర్పంచ్ ల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
గ్రామ పంచాయతీ సర్పంచ్ లు చేసిన అభివృద్దికి నిధులు మంజూరు చేయకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన టార్చర్ కు, వారు ఆత్మహత్యలు చేసుకొన్న విషయాన్ని ఎలా మరచిపోయావ్ కేటీఆర్ అని ప్రశ్నించారు. పుట్టెడు అబద్ధాలతో బతికిన మీరు.. ఇప్పుడు నీతివంతులుగా మాట్లాడటం.. తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని సీతక్క పేర్కొన్నారు.. సర్పంచ్ లకు రావాల్సిన నిధులన్నీ త్వరలో విడుదల చేస్తామని తెలిపారు..
ములుగు (Mulugu) జిల్లా అభివృద్దికి అధికంగా నిధులు మంజూరు చేయాలని కోరిన సీతక్క.. రామప్ప, లక్కవరం సరస్సులను అనుసంధానం చేసేందుకు, గ్రావిటి కాల్వలు నిర్మించేందుకు ల్యాండ్ అక్విడేషన్ జరిగిందని.. డబ్బులు చెల్లించకుండా పెండింగ్ లో ఉన్నవారికి డబ్బులు చెల్లించాలని అధికారులను కోరారు.. మరోవైపు మేడారం జాతరలో భక్తులు ఇబ్బందులుపడకుండా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా స్థాయి అధికారులు, మంత్రులు సహకరించాలన్నారు. జాతరకు భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉందని.. మంత్రులు 25, 28 తేదీల్లో మాత్రమే రావాలని కోరారు..