గత ప్రభుత్వం (Governament) కేవలం ఒకటి లేదా రెండు పంటల కొనుగోళ్లు చేసి మిగతా పంటలకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు (Thummala Nageswara Rao) మండిపడ్డారు. రాష్ట్రంలో 75 శాతం సాగు విస్తీర్ణం కేవలం రెండు, మూడు పంటల క్రిందకు వచ్చిందని వెల్లడించారు.
వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మంగళ వారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ….. గత ప్రభుత్వ హయాంలో కేవలం ఒకటి లేదా రెండు పంటలకు మాత్రమే గిట్టుబాటు ధర కల్పించేవారని వివరించారు. కానీ తమ ప్రభుత్వ హయాంలో అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించే విదంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించామని పేర్కొన్నారు.
పసుపు బోర్డు ఏర్పాటు, సీఐఐ సెంటర్లను కొనసాగించాలంటూ కేంద్రానికి లేఖలు రాశామని వివరించారు. మార్కెటింగ్ శాఖ అధికారులు, మార్కెట్ కమిటీ కార్యదర్శులు మిర్చితో పాటు వేరుశనగ పంటల అమ్మకాలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సంబంధిత జిల్లా అధికారులతో కలిసి వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు మిర్చి, వేరుశనగ అధికంగా పండించే జిల్లాలను సందర్శించాలని మంత్రి ఆదేశించారు. అంతేకాకుండా మార్కెట్లకు వ్యవసాయ ఉత్పత్తులను తీసుకొచ్చే విషయములో రైతులందరికీ అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు.