ఓటమి అనేది గెలుపుకు పునాది కావాలని అంటారు.. కానీ రాజకీయాల్లో మాత్రం.. ఓటమి ఆ పార్టీ పునాదులు కూల్చడానికి కారణం అవుతుందని బీఆర్ఎస్ ను చూస్తే తెలుస్తున్నట్లు చర్చించుకొంటున్నారు.. అసెంబ్లీ ఎన్నికల్లో వరించిన అపజయం.. బీఆర్ఎస్ (BRS) రూపు రేఖలు పూర్తిగా మార్చేసిందని తెలుస్తోంది. అదీగాక లోక్ సభ ఎన్నికల వరకు ఈ పార్టీలో మిగిలే వారు ఎందరో అనే టాక్ మొదలైనట్లు తెలుస్తోంది..
మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ (BRS)కు టార్గెట్ గా మారాయి.. కనీసం ఈ ఎన్నికల్లో అయినా కొంత మైలేజ్ తెచ్చుకొని పార్టీని కాపాడుకొందామని అధిష్టానం భావిస్తుండగా.. కీలక నేతలంతా వరుసగా హ్యాండిస్తున్నారు. ఇప్పటికే కవిత (Kavitha) అరెస్ట్.. మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ మార్పులు. అదీగాక కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, విద్యుత్, ధరణి వంటి వాటిలో అవినీతి జరిగిందనే కాంగ్రెస్ ప్రచారం..
మొత్తానికి కారును ఫామ్ హౌజ్ కు పరిమిత చేసే వరకు హస్తం వదిలేలా లేదనే టాక్.. గులాబీ బాస్ ను కుదురుగా ఉండనీయడం లేదని తెలుస్తోంది. మరోవైపు మరో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరుతారని పదే పదే కాంగ్రెస్ (Congress) మంత్రుల వ్యాఖ్యలు.. క్యాడర్ లో అనుమానాలను రేకెత్తిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అదేవిధంగా పార్టీ మారే 25 మందిలో అసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి (MLA Kova Lakshmi) కూడా ఉందంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి..
తాజాగా పార్టీ మార్పుపై ఎమ్మెల్యే స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో తాను పార్టీ మారబోనని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం బీఆర్ఎస్లో కొనసాగుతానని ప్రకటించారు. ఈ సందర్భంగా ఇదంతా అసత్య ప్రచారమని ఖండించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ముందు ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ నేతలు దృష్టి పెట్టాలని సూచించారు.
ఇదిలా ఉండగా ప్రజలకు త్రికరణ శుద్ధిగా సేవచేసే రాజకీయ నాయకునికి ఎప్పుడు గౌరవం.. ఆదరణ తగ్గదని తెలిసిందే. అయితే నేటి సమాజంలో ప్రస్తుతం ఉన్న రాజకీయాలు.. అహంకారం.. అంగబలం.. ధన బలం.. స్వార్థంతో కూడుకొని ఉన్నాయని మేధావులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి రాజకీయాల వల్ల వ్యవస్థ పూర్తిగా బ్రష్టు పట్టి పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..