తెలంగాణ (Telangana) అసెంబ్లీ స్పీకర్ పదవి కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) నామినేషన్ వేశారు. కాంగ్రెస్ (Congress) పార్టీకి పూర్తి మెజార్టీ ఉండడంతో స్పీకర్ ఎన్నికకు బీఆర్ఎస్ (BRS) మద్దతు పలికింది. అంతేకాదు, గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు సైతం ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
స్పీకర్ నామినేషన్ పత్రాలపై సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy) సంతకం చేసిన అనంతరం గడ్డం ప్రసాద్ నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రాలను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. ఈయనకు బీఆర్ఎస్ తోపాటు ఎంఐఎం కూడా మద్దతు తెలిపింది. రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు సీతక్క, తుమ్మల, శ్రీధర్ బాబు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, ప్రకాష్ గౌడ్, ఎంఐఎం ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.
స్పీకర్ ఎన్నిక విషయంలో మద్దతు తెలపాలని మంగళవారం కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ను కలిసి అడిగారు. ఈ నేపథ్యంలో గులాబీ నేతలు గడ్డం ప్రసాద్ కు మద్దతు తెలిపారు. గురువారం స్పీకర్ గా ఆయన ఏకగ్రీవం కానున్నారు. 15న అసెంబ్లీ, మండలి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 16న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానం చేయనున్నారు.
గడ్డం ప్రసాద్ తెలంగాణ రాష్ట్ర తొలి దళిత స్పీకర్ కానున్నారు. ప్రస్తుత శాసనసభలో అత్యధికులు అగ్రవర్ణాలకు చెందినవారే ఉన్నారు.