మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) కాంగ్రెస్ సర్కార్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆదివారం తెలంగాణ భవన్లో(Telangana Bhavan) మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హమీలు నీటి మూటలని తేలిపోయిందని విమర్శించారు.
రాష్ట్రంలో కేసీఆర్ పదేళ్లు వ్యవసాయరంగాన్ని నిలబెడితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మూడునెలల్లోనే ఆగం చేశారని ఆరోపించారు. కేసీఆర్ వస్తున్నారని తెలిసి ప్రాజెక్టులకు నీళ్లు వదిలారని ఎద్దేవా చేశారు. ఇన్ని రోజులు లేని నీళ్లు ఇప్పుడు ఎలా వచ్చాయని? ప్రశ్నించారు. నీళ్లు ముందే వదిలి ఉంటే పంటలను రైతులు కాపాడుకునే వారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో సాగర్‌లో ఇంతకంటే తక్కువ నీళ్లు ఉన్నా సాగుకు నీరందించినట్లు గుర్తుచేశారు.
రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని, రైతుబంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుబంధు ఇవ్వకుండా వంద రోజుల నుంచి ఇక్కడ వసూలు చేసి ఢిల్లీకి కప్పం కడుతున్నారని విమర్శించారు. కుర్చీని కాపాడుకునేందకు కాంగ్రెస్ మంత్రులు కష్టపడుతున్నారని ఎద్దేవా చేశారు. తుక్కుగూడ ‘జన జాతర’ సభలో రైతుల ప్రస్తావనే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో మార్పు కొత్తగా ఉంటుందని ప్రజలు భ్రమపడ్డారని, 2014 ముందటి పరిస్థితి వస్తుందని ఊహించలేదన్నారు.
మహిళలకు రూ.2500 ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఆ హామీని నెరవేర్చకుండానే మళ్లీ ఇప్పుడు మహిళలకు రూ.లక్ష ఇస్తామంటూ మరో మోసానికి తెరలేపుతుందన్నారని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై వేటు వేయాలని సవాల్ విసిరారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.