బీజేపీ ఎమ్మెల్యే(BJP MLA) ఏలేటి మహేశ్వర్రెడ్డి(Eleti Maheshwar Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. బీ ట్యాక్స్ పేరుతో ఓ మంత్రి విస్తృతంగా వసూళ్లకు పాల్పడుతున్నారని కీలక ఆరోపణలు చేశారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా కాంట్రాక్టర్ల నుంచి 9శాతం శాతం బీ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడని ఆరోపించారు.
ప్రభుత్వంలో ఎన్ని రోజులు ఉంటామో తెలీదన్నట్లు.. ఉన్నప్పుడే దండుకోవాలనే భావనతో దోచుకుంటున్నారని అన్నారు కాగా, ఇటీవల బీజేపీ ఎమ్మెల్యేలను ముట్టుకుంటే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డికి టచ్లో ఉండటం కాదని.. ఆయన సొంత తమ్ముడు రాజగోపాల్ రెడ్డే ఆయనతో టచ్లో లేకుండా పోయారని ఎద్దేవా చేశారు.
దేశ చరిత్రలో అతి పెద్ద కుంభకోణం ధరణి అని, రెండు లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. లక్షల ఎకరాల కుంభకోణం అని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ఎందుకు ధరణిపై చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ భూములపై సమగ్ర సర్వే చేసి, డిజిటలైజేషన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం రూ.83కోట్లు కేటాయించిందని తెలిపారు. ఇప్పటి వరకు సమగ్ర సర్వే జరగలేదన్నారు.
భూదాన్ భూములు, ఎండో మెంట్ భూములు మాయమయ్యాయన్నారు. తెర వెనుక కోట్ల దందా చేతులు మారిందన్నారు. ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలైనా ధరణి పై, భూముల తారుమారు పై సమగ్ర విచారణ ఎందుకు చేపట్టడం లేదన్నారు. లక్షల ఎకరాలు తారుమారు చేశారని ఆరోపించారు. కేకే కాంగ్రెస్లో చేరగానే నీతి వంతుడాయ్యాడా..? అని ప్రశ్నించారు. రంజిత్ రెడ్డి కాంగ్రెస్లో చేరగానే ఆణిముత్యం అయ్యాడా..? అంటూ మండిపడ్డారు.
అవినీతి ఆరోపణలు ఉన్న నేతల్ని పక్కకు పెట్టీ కేవలం కొన్ని అంశాలను మాత్రమే తెర మీదకు తెస్తున్నారని విమర్శించారు. కవిత అరెస్ట్ జరగడం లేదని, బీజేపీ, బీఅర్ఎస్ ఒక్కటేనని ప్రచారం చేశారని, చట్టం తన పని తాను చేసుకు పోతుందన్నారు. ధరణిలో భూములన్నీ ప్రైవేట్ పరమయ్యాయని, లక్షల ఎకరాలు అన్యాక్రాంతం అవుతుంటే రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీకి డబ్బులు పంపించడంలో బిజీగా ఉన్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి పునాదులపై ఏర్పడిందని ధ్వజమెత్తారు. వారి తీరు నచ్చకే బీజేపీలో చేరానని, ప్రాణం పోయేంత వరకు బీజేపీలోనే కొనసాగుతాని ఏలేటి మహేశ్వర్రెడ్డి స్పష్టం చేశారు.