వైసీపీ ప్రభుత్వం(YCP Government)లో మార్పులు, చేర్పుల వ్యవహారం కొన్ని ప్రాంతాల్లో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం(Ananthapuram)లో ఉన్న రెండూ ఎంపీ స్థానాలనూ.. మూడు అసెంబ్లీ స్థానాలను వైసీపీ అధిష్టానం మార్చేసింది. అంతేకాదు మరో నాలుగు స్థానాల్లో మార్పు చేర్పులు ఉండొచ్చంటూ సంకేతాలు ఇచ్చింది. ముఖ్యంగా సింగనమల, మడకశిర, రాయదుర్గం అసెంబ్లీ స్థానాల్లో మార్పు ఖాయమైనట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.
ఇప్పటికే రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలో సింగనమల ఎమ్మెల్యే(Singanamala MLA) జొన్నలగడ్డ పద్మావతి(Jonnalagadda Padmavathi) సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సింగనమల నియోజకవర్గం అంటే అంత చిన్న చూపు ఎందుకు? ఒక ఎస్సీ మహిళను కాబట్టేనా? నియోజకవర్గానికి నీళ్లు తీసుకురావాలంటే ప్రతీసారి యుద్ధం చేయాల్సివస్తోంది.
కనీసం ఒక్క చెరువుకు నీటినైనా వదలమంటే జిల్లా అధికారుల్లో చలనం లేదు.’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, తాడపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ‘ఎస్సీ మహిళనైతే మీ కాళ్లు పట్టుకోవాలా..? అందరి కింద అణిగి మణిగి ఉండాలా? నీటి వాటా మాట్లాడితే పెద్ద నేరం.. ఈ ఐదేళ్లలో ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టారు.’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
తాను గడపగడప కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని ఎమ్మెల్యే పద్మావతి అన్నారు. 2014 – 2019 లాగే క్యాస్ట్ ఈక్వేషన్ 2024లో ఉంటాయన్నారు. తాను అభ్యర్థిగా పనికిరానప్పుడు తాను చెప్పిన అభ్యర్థిని ఎలా నిలబెడతారని నిలదీశారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా తన పేరును ప్రకటించాకే బస్సు యాత్ర చేపట్టాలన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట తప్పారని అన్నారు. తెర వెనుక ఏమైనా జరిగితే చెప్పలేమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.