గవర్నర్ ప్రసంగం రాష్ట్ర భవిష్యత్తును సూచిస్తుందని బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA) పాయల్ శంకర్ (Payal Shankar) అన్నారు. గవర్నర్ ప్రసంగంలో కొన్ని హామీలనే ప్రస్తావించారని తెలిపారు. హామీలను ఎలా అమలు చేస్తారో అనే విషయాన్ని ప్రసంగంలో చెబితే బాగుండేదని చెప్పారు. ఆరు గ్యారంటీలు తప్ప మరేమీ పట్టించుకోం అనేలాగా గవర్నర్ ప్రసంగం ఉందని విమర్శలు గుప్పించారు.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చ సందర్బంగా బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ…. గతంలో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉండేదని తెలిపారు. కానీ ఒకటో తేదీన జీతాలు ఇవ్వడమే ప్రభుత్వ విజయం కాదన్నారు. తెలంగాణ ఏర్పాటుకు సహకరించిన వాళ్లను గుర్తుచేసుకోవడం మంచిదని చెప్పారు.
గవర్నర్ ప్రసంగంలో మన్మోహన్, సోనియాను గుర్తు చేసుకున్నారని వెల్లడించారు. కానీ తెలంగాణ ఏర్పాటు విషయంలో సహకరించిన బీజేపీని విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా ప్రభుత్వ సంకుచిత స్వభావానికి నిదర్శనమని ఫైర్ అయ్యారు. గవర్నర్ ప్రసంగంలో సుష్మా స్వరాజ్ గురించి ఒక్కమాట చెప్పలేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
రాష్ట్రానికి ఉన్న అప్పులెన్ననే విషయాన్ని ప్రస్తావించి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మాత్రం సీఎంలా చురుగ్గా లేదన్నారు. ఆరు గ్యారంటీలే తప్ప మిగతా గ్యారంటీలకు హామీ ఎవరిస్తారని నిలదీశారు. మిగతా హామీలను కూడా ఎప్పటిలోగా అమలు చేస్తారో గవర్నర్ ప్రసంగంలో చెబితే బాగుండేదన్నారు. ఆరోగ్యశ్రీ పరిధి రూ.10 లక్షలకు పెంచారని వివరించారు. కానీ ప్రభుత్వం చెప్పినట్లు ఆరోగ్యశ్రీ అమలుకు నోచుకోలేదని ఆరోపించారు.