చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఓటు కోసం డబ్బులిస్తే బంగారంలా తీసుకోండని, ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకే వేయాలని కోవూరు ఎమ్మెల్యే(Kovuru MLA) నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి (Nallapareddy Prasanna Kumar Reddy) పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా విడవలూరు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో వైయస్సార్ ఆసరా కింద నాలుగో విడత చెక్కులను పంపిణీ చేశారు.
అనంతరం ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒక్క ఓటుకు రూ.2వేల నుంచి రూ.3వేలు ఇస్తామంటున్నారని ఆరోపించారు. నాలుగున్నర ఏళ్ల పాటు ప్రజలకు కనపడని ప్రతిపక్ష నేతలు నేడు పగటి వేషగాళ్లలా వ్యవహరిస్తూ ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు హయాంలో కుటుంబాలు బాగుపడ్డాయా..? వైఎస్ జగన్మోహన్రెడ్డి లాగా సంక్షేమ పథకాలు ఇచ్చారా..? అంటూ నిలదీశారు. ఇక, మహిళల పేరు మీదే వైఎస్ జగన్ పథకాలు ఇస్తున్నారని గుర్తుచేశారు. తొమ్మిది సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు పరిపాలనను, ఐదు సంవత్సరాలు కొత్త రాష్ట్రంలో పాలించాడని గుర్తుచేశారు.
అయితే, ఓట్ల కోసం వాగ్దానాలు చేయడం, అధికారంలోకి వచ్చాక మోసం చేయడం పరిపాటిగా మారిందంటూ దుయ్యబట్టారు. రెండు ఎకరాల ఆసామి చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు రూ.4లక్షల కోట్ల ఆస్తులకు అధిపతి అయ్యాడంటూ విమర్శించారు. అవన్నీ అక్రమంగా సంపాదించిన డబ్బే అని ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి ఆరోపించారు.