ఎన్నికల ముందు మంత్రి హరీశ్ రావు (Harish Rao) చెప్పే పిట్టకథలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు (Raghunandan) విమర్శించారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే విధంగా బీఆర్ఎస్ (BRS) నాయకులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సర్కార్ పై మండిపడ్డారు.
బీఆర్ఎస్ లో ఉన్నవాళ్లను పైస్థాయి లీడర్లు బెదిరిస్తున్నారని అన్నారు రఘునందన్. అక్కడ నచ్చక ఇతర పార్టీలకు వెళ్దామనుకుంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు రావని బెదిరించడం సిగ్గుచేటన్నారు. ములుగు నియోజకవర్గ పర్యటనలో మంత్రి హరీశ్ రావు బీజేపీ (BJP) నాయకులు గెలిస్తే మోటర్లకు మీటర్లు పెడతారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు.
దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఎన్నికల్లో హరీశ్ రావు ఇదే ప్రచారం చేసినప్పటికీ ప్రజలు విశ్వసించలేదని గుర్తు చేశారు. నేటికీ ఏ నియోజకవర్గంలో కూడా మోటార్లకు మీటర్లు పెట్టిన దాఖలాలు లేవని వెల్లడించారు. మాయ మాటలు, పిట్ట కథలతో మంత్రి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తే రాబోయే ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రోజురోజుకీ తన ఉనికిని ప్రజల్లో కోల్పోతున్న హరీశ్ రావు, ఇకనైనా నిజాలను మాట్లాడాలని హితవు పలికారు రఘునందన్. రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జనంలో కేసీఆర్ పై విశ్వాసం లేదని.. ఈసారి ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు.