ఈమధ్య ఎల్లారెడ్డి ఎమ్మెల్యే (MLA) జాజల సురేందర్(Surender) పేరు ఏదో ఒక అంశంపై మీడియాలో నలుగుతోంది. ముందుగా ఆయన పేరుతో ఫేక్ ఇన్ స్టా క్రియేట్ చేసి డబ్బులు వసూలు చేసిన వ్యవహారం వెలుగుచూసింది. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కాయితీ లంబాడీల గురించి మాట్లాడిన తీరు గిరిజనులకు ఆగ్రహాన్ని తెచ్చి పెట్టింది. దీంతో చేసేది లేక తాజాగా క్షమాపణ కోరారు ఎమ్మెల్యే.
మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన సురేందర్. కాయితీ లంబాడీలను ఎస్టీల్లో చేర్చాలని అన్నారు. దీంతో గిరిజనులు భగ్గుమన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని బంజారా భవన్లో సమావేశమైన గిరిజనులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో డిపాజిట్ చేయడానికి కూడా డబ్బులు లేకపోతే.. చందాలు వేసి మరి కాంగ్రెస్ నుంచి ఆయన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇలా చేస్తారా? అంటూ మండిపడ్డారు గిరిజనులు.
అభివృద్ధి పేరుతో పార్టీ మారిన సురేందర్ ఇప్పుడు తమకే వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులు తనపై కక్ష పెంచుకుంటున్నారన్న విషయం ఎమ్మెల్యే చెవిన పడింది. వెంటనే, వారి దగ్గరకు వెళ్లి క్షమాపణలు కోరారు. కానీ, వాళ్లు తగ్గేదే లేదన్నారు. అసెంబ్లీ సాక్షిగా క్షమాపణలు తెలపాలని నినాదాలు చేశారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మరోవైపు, ఇటీవల సురేందర్ పేరిట సైబర్ నేరగాళ్లు ఫేక్ ఇన్ స్టాగ్రామ్ ఖాతాను ఓపెన్ చేశారు. పలువురు ప్రముఖులు, బీఆర్ఎస్ లీడర్లు, ఇతరులకు ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పంపారు. వారితో చాట్ చేస్తూ.. డబ్బులు పంపించాలని కోరారు. ఈ విషయం ఎమ్మెల్యేకు తెలిసి తన స్నేహితులు, ప్రజలకు సూచనలు చేశారు. ఎవరికి మనీ పంపొద్దని చెప్పారు.