బీఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ (BRS) చేసిన అభివృద్థి ఏంటని ఎండగడుతూనే.. సభలో, సమావేశాల్లో కారు టైర్లని పంక్చర్ చేస్తున్నారు. మొత్తానికి బీజేపీ (BJP) కాంగ్రెస్ (Congress).. బీఆర్ఎస్ పార్టీని గట్టిగానే అరుసుకుంటుందని కొందరు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ (MLC) జీవన్ రెడ్డి (Jeevan-Reddy) సమయం దొరికినప్పుడల్లా గులాబీ పార్టీ రెక్కలని తుంచుతూనే ఉన్నారు.
మిగులు ఆదాయంలో ఉన్న తెలంగాణను కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని జీవన్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం పనుల్లో లక్షకోట్లు వెనుకేసుకున్న కేసీఆర్, రైతుల జీవితాని ఆగం చేశారని జీవన్ రెడ్డి అన్నారు. పార్టీ శ్రేణులతో కలిసి నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడంలో కేసీఆర్ విఫలమయ్యారని మండిపడ్డారు. తెలంగాణ యువకుల బలిదానాలతో ఏర్పడిన రాష్ట్రాన్ని తానొక్కడే సాధించినట్టు ప్రచారం చేసుకోవడం కల్వకుంట్ల కుటుంబానికే చెందిందని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారన్న ఆయన, రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నట్టు తెలిపారు.. తెలంగాణ పాలనలో మార్పు రావాలంటే బీఆర్ఎస్ పార్టీని మూలాన పడేయాలని ప్రజలు చూస్తున్నట్టు జీవన్ రెడ్డి వెల్లడించారు. ఉద్యోగులకు సమయానికి జీతాలు రాక, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక, పేదలకు ఉపాధి అవకాశాలు కనబడక విసుగు చెందారని జీవన్ రెడ్డి ఆరోపించారు.
ఎన్నికలకు ముందు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కొత్త వేషాలు వేయడంలో బీఆర్ఎస్ దిట్ట అని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు.. కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి.. అవినీతిలో భాగస్వామ్యంగా ఉన్న ఏ అధికారులను, నాయకులను వదిలిపెట్టమని జీవన్ రెడ్డి హెచ్చరించారు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే జ్యుడీషియల్ ఎంక్వయిరీ వేసి బీఆర్ఎస్ అవినీతి బయటపెడతామని జీవన్ రెడ్డి సవాల్ విసిరారు.. కాంగ్రెస్ తోనే రాష్ట్రం బాగుపడుతుందని ఆయన తెలిపారు.