కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ(Rahul gandhi)పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) సెటైర్లు విసిరారు. బోధన్‌కు చుట్టపు చూపులా వచ్చి తిరిగి హైదరాబాద్ వెళ్లి బిర్యాని, పాన్ తిని.. ఢిల్లీకి వెళ్లిపోవాలని సూచించారు. తెలంగాణ వచ్చిన ప్రతీసారి తమ ఆతిథ్యాన్ని స్వీకరించాలని హితవు పలికారు.
బోధన్ నియోజకవర్గంలోని నవీపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే షకీల్‌ఖు మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ వచ్చి ఐదు గంటల కరెంటే ఇస్తామని చెప్తున్నారని.. ఐదు గంటల కరెంటు కావాలా లేదా 24 గంటల కరెంటు ఇచ్చేవాళ్లు కావాలా? రైతులు ఆలోచించాలని సూచించారు. అదేవిధంగా రైతు బంధు కావాలా లేదా రాబంధు కావాలా ? అన్న అంశాలపై ఆలోచన చేయాలని కోరారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ శాంతి భద్రతల సమస్య, కర్ఫ్యూలు, మతకల్లోలాలు ఉండేవని, గత పదేళ్ల సీఎం కేసీఆర్ పాలనలో ఒక్క శాంతి భద్రతల సమస్య రాలేదని కవిత వివరించారు. ప్రస్తుతం తెలంగాణ ప్రశాంతంగా ఉందని, ప్రజలు ప్రశాంతగా జీవిస్తున్నారని చెప్పారు. ప్రశాంతగా ఉన్న తెలంగాణలో చిచ్చుపెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు.
గాంధీ కుటుంబానికి అవసరమైనప్పుడల్లా తెలంగాణ అండగా నిలిచిందని కవిత తెలిపారు. కానీ, వాళ్లు ప్రతీసారి తెలంగాణను మోసం చేశారని మండిపడ్డారు. వందలాది మంది యువతను కాంగ్రెస్ పార్టీ బలితీసుకుందని, ప్రత్యేక తెలంగాణ ఆలస్యం కావడంతో అనేక మంది ఆత్మబలిదానాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మంచి వాళ్లను ఎన్నుకుందామా లేదా ముంచేవాళ్లను ఎన్నుకుందామా అన్నది ప్రజలు ఆలోచించాలని కోరారు. రానున్న ఐదేళ్లలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం చేపడుతామని తెలిపారు.