– కేంద్రం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి
– రాష్ట్రానికి రావాల్సినవెన్నో..
– పెండింగ్ లో ఉన్నాయి
– ప్రతిపక్షాల ఒత్తిడి వల్లే..
– మహిళా బిల్లును ఆమోదించారు
– ఇది బీజేపీ గిఫ్ట్ కాదు
– విపక్ష ‘ఇండియా’ కూటమికి గ్యారెంటీ లేదు
– సీట్ల సిగపట్లు తప్పవు
– జాతీయ మీడియాకు కవిత ఇంటర్వ్యూలు
బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కవిత (Kavitha) వరుసగా జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ.. పలు అంశాలపై స్పందించారు. ముందుగా ప్రధాని మోడీ (PM Modi) తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన హామీలపై ప్రశ్నించారు. రాష్ట్రంలో ఐఐఎంలు, ఐఐటీలు, జాతీయ విద్యాసంస్థలు నిర్మించాలని డిమాండ్ చేశారు. అనేక హామీలు పెండింగ్ లో ఉన్నాయని వాటన్నింటినీ పూర్తి చేయాలన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) భవిష్యత్ తరాల కోసం ఆలోచించి పని చేస్తారని చెప్పారు కవిత. ఆయన ఎప్పుడూ ఎన్నికల కోసం పని చేయరని తెలిపారు. కాంగ్రెస్ పార్టీది కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమేనని విమర్శించారు. ఇక విపక్ష ‘ఇండియా’ కూటమిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూటమి ఉనికి ప్రశ్నార్ధకమేనని అన్నారు. ఇది రాబోయే కాలంలో ఉంటుందో లేదో గ్యారంటీ లేదని పేర్కొన్నారు.
రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఆపై పార్లమెంట్ ఎన్నికల్లో సీట్ల సర్ధుబాటు సమస్యలు ముందుకొస్తాయని.. ఆ తర్వాత పరిస్ధితి వేరుగా ఉంటుందని విపక్ష కూటమిని ఉద్దేశించి మాట్లాడారు కవిత. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత పరిస్ధితి మారుతుందని అన్నారు. దేశంలో ఎన్నికలకు ముందు కూటములు పెద్దగా విజయవంతమైన దాఖలాలు లేవని గుర్తు చేశారు. అందుకే, తాము వేచిచూసే ధోరణితో వ్యవహరిస్తామని, బీఆర్ఎస్ జాతీయ అజెండాతో పనిచేసే జాతీయ పార్టీ అని స్పష్టం చేశారు.
తాము కర్ణాటకలో ఒకలా, తెలంగాణలో మరోలా ఉండే కాంగ్రెస్ (Congress) పార్టీలాగా కాదన్నారు కవిత. పదేండ్లలో తెలంగాణకు ఎలాంటి మేలు చేయని బీజేపీ (BJP) కి రాష్ట్రంలో కర్ణాటక తరహా ఫలితాలే వస్తాయని ఎద్దేవ చేశారు. ఏ పార్టీ ఈ ప్రాంత సమస్యలను లేవనెత్తుతున్నదనేది ప్రజలు గమనిస్తున్నారని.. రాబోయే ఎన్నికల్లో ఫలితాలు కూడా అలాగే ఉంటాయని స్పష్టం చేశారు కవిత.